లావణ్యను శంషాబాద్‌లోని లాడ్జ్‌లో ఉంచి.. దారుణంగా..

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ లావణ్య హత్య కేసు చిక్కుముడి వీడింది. ప్రియుడు సునీలే చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మస్కట్ వెళ్తున్నామని చెప్పి, ఇంటి నుంచి లావణ్యను తీసుకొచ్చిన సునీల్..‌ లావణ్యను హత్య చేసి, సూట్‌ కేసులో పెట్టి సూరారంలో వదిలేసి వెళ్లిపోయాడు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సునీల్‌ను అరెస్ట్‌ చేసి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

రామచంద్రాపురం LI 922లో నివాసముండే శ్రీనివాస్ దంపతుల కుమార్తె లావణ్య సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తోంది. నల్లమల్లారెడ్డి కాలేజీలో చదువుతున్నప్పుడు ఆమెకు బీహార్ కు చెందిన సునీల్‌ తో పరిచయమైంది. అది ప్రేమగా మారింది. ఈ విషయం లావణ్య వాళ్ల ఇంట్లో కూడా తెలుసు. ఇటీవల మస్కట్‌ కు వెళ్తున్నామని లావణ్యను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చాడు సునీల్. అయితే సునీల్‌, లావణ్య మస్కట్ వెళ్లలేదు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పింది లావణ్య. ఇటు ఇంటికి తిరిగి రాక, అటు మస్కట్‌ వెళ్లక పోవడంతో కూతురు విషయంలో ఏదో జరిగిందని శ్రీనివాస్ అనుమానించాడు. ఈ నెల 7న కూతురు తప్పిపోయినట్టు ఆర్సీపురం పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాడు. లావణ్యను సునీల్‌ తీసుకెళ్లిన విషయం కూడా పోలీసులకు చెప్పాడు శ్రీనివాస్‌. దీంతో పోలీసులు సునీల్ ను తమ దైన స్టైల్‌లో విచారించే సరికి లావణ్య హత్య విషయం బయటపడింది.

అయితే లావణ్య తన వివాహానికి అడ్డుగా వస్తోందని భావించి, ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించాలనుకున్నాడు. అందుకే మస్కట్‌ పేరుతో మాయ మాటలు చెప్పి, ఇంటి నుంచి తీసుకెళ్లాడు. శంషాబాద్‌ లోని లాడ్జ్‌ లో ఉంచాడు. అక్కడే హత్య చేసి, మృతదేహాన్ని సూట్‌ కేసులో పెట్టి హైదరాబాద్‌ శివారు సూరారంలో వదిలేసాడు. పోలీసులు సూరారానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Recommended For You