వాడొచ్చేవరకు నీ మెడలో తాళి కట్టను..

ఆడించే నాన్న.. లాలించే అమ్మ.. అడుగులు తడబడే చిన్నారులకు అమ్మానాన్నే ప్రపంచం.. ఒక సినిమాలో చెప్పినట్లు ముందు భార్యా భర్తలుగా ఉంటే ఆతరువాత అమ్మానాన్నగా మిమ్మల్ని అంగీకరిస్తాను అని. అందుకే నేను చేసుకోబోయే విశాఖన్ గురించి నాకొడుకు వేద్‌కి ముందే వివరించానంటోంది తమిళ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ కూతురు సౌందర్య.

2010లో సౌందర్య.. అశ్విన్‌ని ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరి కుమారుడు వేద్. పెళ్లైన నాలుగేళ్లకు మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఇటీవల సౌందర్య ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. విశాఖన్‌తో పెళ్లిముందు వేద్ ఇతడిని నాన్నగా అంగీకరిస్తాడో లేదో అని మదన పడ్డాను. అందుకే ముందే ఫోటో చూపించి.. ఇతనే మీ డాడీ అని చెప్పాను. వేద్‌కి కూడా విశాఖన్ నచ్చినట్టున్నాడు.

ఫోటో చూడగానే వేద్ చాలా ఆనందపడిపోయాడు. విశాఖన్‌‌కి కూడా వేద్ బాగా నచ్చేశాడు. ఇద్దరూ త్వరగా కలిసిపోయారు. వాళ్లిద్దరి సాన్నిహిత్యాన్ని చూసి వేద్ గురించి నేను పడ్డ టెన్షన్ అంతా అట్టే ఆవిరి అయిపోయింది. నా సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. పెళ్లికి ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో వేద్‌ని మండపానికి తీసుకురాలేదు.

దాంతో వాడు నా పెళ్లి చూడడేమో అని చాలా కంగారు పడిపోయాను. నన్ను గమనించిన విశాఖన్ వేద్ వచ్చాకే తాళి కడతాను.. సరేనా అని అన్నారు. నిజానికి విశాఖన్ కూడా వేద్‌ని అడిగే నన్ను పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో తీసిన వీడియోని వాడికి 18 ఏళ్లు వచ్చాక చూపిస్తాను అని చెప్పుకొచ్చింది.

Recommended For You