విద్వేష వ్యాఖ్యలు చేసిన నేతలపై ఈసీ కొరడా..

విద్వేష వ్యాఖ్యలు చేసిన నేతలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ కొరడా జులిపించింది. రానున్న రెండు మూడు రోజులు ప్రచారం చేయకూడదంటూ నేతాశ్రీలపై బ్యాన్‌ విధించింది. విద్వేష, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి, ఎస్పీ నేత ఆజంఖాన్‌పై 3 రోజులు, బీఎస్పీ చీఫ్‌ మాయావతి, కేంద్రమంత్రి మేనకా గాంధీపై 2 రోజుల పాటు ఆంక్షలు విధిస్తూ సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆంక్షలు విధించిన రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం చేయకూడదని నేతలకు సూచించింది. సీఈసీ బ్యాన్‌ విధించడంతో నేటి నుంచి ఈ నలుగురు ప్రచారానికి దూరం కానున్నారు.

నేతలు ఓట్ల కోసం విద్వేష ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటే ఏం చేస్తున్నారని సీఈసీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఆఘా మేఘాలపై కదిలిన ఎన్నికల సంఘం తన పరిధిలో చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్నికల సంఘానికి తనకున్న అధికారాలు గుర్తుకు వచ్చాయి. రాజ్యాంగంలోని 324 నిబంధనలో పేర్కొన్న ఎన్నికలను నియంత్రించే అధికారాన్ని అన్వయించుకొని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, బీఎస్పీ అధినేత మాయావతి, ఎస్పీ నేత ఆజంఖాన్‌, కేంద్ర మంత్రి మేనకాగాంధీలను ఈసీ అభిశంసించింది.

కీలక సమయంలో ప్రచారం చేయకుండా ఈసీ బ్యాన్‌ విధించడం పెద్ద దెబ్బగానే భావిస్తున్నారు ఆయా పార్టీల నేతలు. యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతికి సంబంధించి ఈ రెండు రోజుల ప్రచారం షెడ్యూల్‌ ఇప్పటికే ఖరారైంది. అయితే అకస్మాత్తుగా సీఈసీ నిషేధం విధించడంతో.. ఎన్నికల ప్రచారాన్ని వాయిదా వేసుకుని ఇంటికే పరిమితమయ్యారు.

Recommended For You