ఏపీలో 45 ఈవీఎంలే పని చేయలేదు – అరోరా

ap-locala-bosy-elections

విపక్షాల డిమాండ్లను ఈసీ ఏమాత్రం లెక్క చేయడం లేదు. ఎన్నికల ఫలితాల్లో పారదర్శకత కోసం 50 శాతం వీవీప్యాట్‌లు లెక్కించాలన్న ప్రతిపక్షాల వాదనకు ససేమిరా అంటోంది కేంద్ర ఎన్నిక సంఘం. వీవీ ప్యాట్ల లెక్కింపులో సుప్రీం ఆదేశాలను అమలు చేస్తామని స్పష్టం చేసింది. దీంతో విపక్ష పార్టీలు, ఎన్నికల సంఘం మధ్య వీవీ ప్యాట్ల రగడకు ఇప్పట్లో ఫుల్‌ స్టాప్‌ పడేలా కనిపించడం లేదు.

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో విపక్షాలు ఈవీఎంల్లో అవకతవకలు, వీవీ ప్యాట్ల లెక్కింపుపై జాతీయ స్థాయిలో పోరాటాన్ని ఉధృతం చేశాయి. అన్ని రకాలుగా కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచారు. పలు మార్లు కలిసి ఈవీఎంలు, వీవీ ప్యాట్ల లెక్కింపుపై ఉన్న అభ్యంతరాలను సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎన్నికల సంఘం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. విపక్షాల డిమాండ్లను పక్కకు పెడుతున్న సీఈసీ…తామనుకున్నది చేస్తామంటూ ముందుకు వెళ్తోంది.

50 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాలన్న విపక్షాల డిమాండ్లను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా తోసిపుచ్చారు. వీవీప్యాట్‌ల అంశంపై ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీప్యాట్‌లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎంపిక చేసి లెక్కించాలని సుప్రీంకోర్టు చెప్పిందని.. ఈ ఆదేశాలను అమలుచేయాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు ఆదేశాలు జారీచేశామన్నారు అరోరా. ఒక వేళ విపక్షాలు కోర్టుకు వెళితే తమ అభిప్రాయాలను స్పష్టం చేస్తామని తెలిపారు. ఒక వ్యక్తికి రక్త పరీక్షలు చేయాలంటే నమూనాలను ఒకచోట నుంచి తీసుకుంటారా? శరీరంలోని 20 చోట్ల నుంచి తీసుకుంటారా? అని ప్రశ్నించిన సునీల్‌ అరోరా.. ఈవీఎంలపై విమర్శలు ఆవేదనకరమన్నారు.

ఓ జాతీయ చానల్‌ ఇంటర్వూలో మాట్లాడిన సునీల్ అరోరా.. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల నిర్వహణపై వచ్చిన విమర్శలపై కూడా స్పందించారు. ఏపీలో 45 ఈవీఎంలు మాత్రమే పని చేయలేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈవీఎంల వైఫల్యంపై మేం పూర్తిస్థాయి వివరాలు సేకరించి చార్ట్‌ తయారుచేశామన్నారు. మరోవైపు ఈవీఎంలు దేనికి అదే ప్రత్యేకమని…ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండవు కాబట్టి వాటిని ట్యాంపర్‌ చేయలేరన్నారు. అవి సరిగా పనిచేయకపోవచ్చు తప్పితే ట్యాంపర్‌కు వీలుకాదని అన్నారు సునీల్‌ అరోరా.

సీఈసీ దిగొచ్చే వరకు పోరాటం ఆపేది లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వీవీప్యాట్‌ రసీదుల లెక్కింపు, ఎన్నికల సంస్కరణలపై దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని అన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఎందుకు వెనుకాడుతుందని ప్రశ్నించారు. 50 శాతం వీవీప్యాట్లలో స్లిప్పులు లెక్కించాలని మరోసారి సుప్రీం కోర్టు వెళ్తామని స్పష్టం చేశారు చంద్రబాబు.

Recommended For You