లెక్చరర్ ఫ్లాట్‌లో బీటెక్‌ యువతి అనుమానాస్పద మృతి

విశాఖలో బీటెక్‌ యువతి సూసైడ్ అనుమానాస్పదంగా మారింది. ఇంటి నుంచి కాలేజీకని వెళ్లిన జోత్స్న.. ఓ లెక్చరర్ ఫ్లాట్‌లో ఉరి వేసుకుని చనిపోయింది. ఇది ముమ్మాటికీ హత్యేనని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తుంటే.. తనకు ఎలాంటి సంబంధం లేదని లెక్చరర్ అంకుర్ అంటున్నాడు. మల్కాపురం జయేంద్రకాలనీకి చెందిన జ్యోత్స్న ప్రస్తుతం బుల్లయ్య కళాశాలలో బీటెక్‌ ఫస్టియర్ చదువుతోంది. నిన్న కాలేజ్‌కి వెళ్లేందుకు తండ్రి దేవకర్‌ ఆమెను బస్‌స్టాప్‌లో దించారు. ఐతే.. జోత్స్న కాలేజీకి వెళ్లకుండా అక్కడి నుంచి శాంతిపురంలోని కట్టా ఎన్‌క్లేవ్‌లో ఉంటున్న అంకుర్ ఫ్లాట్‌కి వచ్చింది. గతంలో ద్వారకానగర్‌లో IIT కోచింగ్ తీసుకునే సమయంలో అంకుర్‌తో జోత్స్నకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పలుమార్లు అతని ప్లాట్‌కు కూడా వెళ్లేది. ఐతే.. డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కోసమే ఆమె వచ్చేదా.. లేదంటే ఇద్దరి మధ్య వేరే స్నేహం ఉందా అనే దానిపై క్లారిటీ లేదు. తీరా ఇప్పుడు ఆమె అంకుర్ ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని చనిపోవడం కలకలం రేపింది.

మధ్యాహ్నం ఫ్లాట్‌కి వచ్చిన అంకుర్.. ఈ సూసైడ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను తన స్నేహితుడితో కలిసి ఉంటున్నానని, ఉదయం తాము కాలేజ్‌కి వెళ్లాక జోత్స్న ఎందుకు వచ్చిందో తెలియదని చెప్తున్నాడు. ఈ సూసైడ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడు. జోత్స్న తనను ప్రేమిస్తున్నానంటూ గతంలోనూ పలుమార్లు వెంట పడిందని చెప్తున్నాడు. ఈ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న నాల్గవ పట్టణ పోలీసులు పూర్తి వివరాలు రాబట్టేందుకు దర్యాప్తు చేస్తున్నారు.

అంకుర్ చెప్తున్న దాన్నిబట్టి చూస్తే అతను కాలేజ్‌కి వెళ్లాక అమ్మాయి ఫ్లాట్‌కి వచ్చింది. అంటే.. ఆమెకు తాళం ఎవరు ఇచ్చారు..? వీరిద్దరి మధ్య ఉన్న పరిచయంపై అతను అబద్ధం చెప్తున్నాడా అన్న దానిపై దర్యాప్తు సాగుతోంది. అటు, తన కుమార్తెది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని దేవానంద్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అంకుర్‌తోపాటు, అతడి స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Recommended For You