నెల్లూరులో భారీగా బయటపడ్డ వీవీ ప్యాట్ స్లిప్‌లు.. సీఈవో వివరణ..

ap-locala-bosy-elections

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీ ప్యాట్‌ స్లిప్‌ల కలకలం రేగింది. ఆత్మకూరు ప్రభుత్వోన్నత పాఠశాల ఆవరణలో వీవీ ప్యాట్‌ స్లిప్‌లు దర్శనమిచ్చాయి. పాఠశాల ఆవరణలో 133, 134 బూత్‌లకు చెందిన వీవీ ప్యాట్‌ స్లిప్‌లు కన్పించడంతో స్థానికులు విస్తుపోయారు. వీవీప్యాట్ స్లిప్పులపై సీఈవో వివరణ ఇచ్చారు. ఉద్యోగుల అరెస్ట్‌కు ఆదేశించారు.

ఈవీఎంలపై పలు రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్‌ స్లిప్పులు దొరకడం తీవ్ర కలకలం రేపింది. ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వీవీప్యాట్‌ స్లిప్పులు భారీగా బయటపడ్డాయి. పలు కవర్లలో వారికి వీవీపాట్ స్లిప్పులు కనిపించాయి. వాటిపై సీరియల్ నెంబర్, సెషన్, అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుమారు 300లకు పైగా ఉన్న స్లిప్పులను ఆర్డీవో బృందం స్వాధీనం చేసుకొని కాల్చివేశారు. వీవీప్యాట్ స్లిప్పులు ఎలా బయటపడ్డాయనే అంశంపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ కూడా ఆదేశించారు. అయితే ఈ ఘటనతో రాజకీయ పార్టీలలో మళ్లీ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

వీవీ ప్యాట్ స్లిప్‌లు బయటకు రావడంపై జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు సీరియస్‌ అయ్యారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఐతే ఆ స్లిప్పులపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలక్రిష్ణ ద్వివేది వివరణ ఇచ్చారు. అక్కడ దొరికిన చీటీలు పోలింగ్ రోజువేసినవి కాదని… మాక్ పోలింగ్ తాలూకు స్లిప్పులని స్పష్టం చేశారు. సిబ్బంది ఉద్దేశపూర్వకంగా బయట పారేసినట్లుగా ద్వివేది ఆరోపించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులను తక్షణం అరెస్ట్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం పరిధిలో జరిగే తప్పులకు ఆర్వోలే బాధ్యులవుతారని ఆయన హెచ్చరించారు.

పోలింగ్‌కు ముందే ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన ఈవిఎంలలో వెయ్యి ఓట్లను బెల్ ఇంజినీర్లు పోల్‌ చేశారు. ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్దారించుకున్న తర్వాత వాటిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. ఎవరో ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా కమీషనింగ్‌ సమయంలో వేసిన వీవీప్యాట్‌ స్లిప్పులను బయట పారేశారని వివరించారు ద్వివేది.

Recommended For You