ఇంగ్లీష్ గడ్డపై టీమిండియాను ఊరిస్తోన్న వరల్డ్‌కప్‌

WORLD-CUP-TEAM

ప్రపంచకప్‌ కోసం భారత జట్టు ఎంపిక పూర్తయింది… ఇక మైదానంలో సత్తా చాటడమే మిగిలింది. సరిగ్గా 36 ఏళ్ళ క్రితం భారత క్రికెట్ జట్టు చరిత్రను తిరగరాసింది. అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్‌సేన విశ్వవిజేతగా నిలిచి సరికొత్త సువర్ణధ్యాయ్యాన్ని లిఖించింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో విండీస్‌ను మట్టికరిపించి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఇక్కడ నుండి భారత క్రికెట్‌ ఏ స్థాయికి చేరుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఇంగ్లీష్ గడ్డపై ప్రపంచకప్‌ టీమిండియాను ఊరిస్తోంది. జట్టు ఎంపిక పూర్తవడంతో ఇప్పుడు మన బలాల, బలహీనతలపై చర్చ మొదలైంది. గత రికార్డుల పరంగా ఇంగ్లాండ్ గడ్డపై పుంజుకున్న భారత్‌కు ఈ ప్రపంచకప్‌లో గట్టిపోటీనే ఎదురుకానుంది. నిజానికి ఇంగ్లాండ్ పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. స్వింగ్ బౌలర్లకు అనుకూలించి ఈ పిచ్‌లపై ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. గత కొన్నేళ్ళుగా ఇక్కడ మన రికార్డు మెరుగైనప్పటకీ.. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో ఏ జట్టునూ తేలిగ్గా తీసుకోలేం. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఓడించి మినీ ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న తర్వాత మన రికార్డులు మెరుగయ్యాయి. గత ఏడాది వన్డే సిరీస్ కోల్పోయినా.. బాగానే పోరాడింది. దీంతో ప్రస్తుత ప్రపంచకప్‌లో అంచనాలు పెరిగాయని చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే భారత్ తొలిసారి ప్రపంచకప్ గెలిచింది ఇక్కడే కావడంతో మళ్ళీ ఆ సెంటిమెంట్ కలిసొస్తుందని అభిమానుల నమ్ముతున్నారు. 83లో కపిల్‌సేన ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి కప్ సాధించి ప్రపంచ క్రికెట్‌ నివ్వెరపోయేలా చేసింది. భారత్ విశ్వవిజేతగా నిలుస్తుందని ఆ టైమ్‌లో ఎవ్వరూ కనీసం ఊహించలేదు. అంచనాలు లేకపోవడమే తమకు బాగా కలిసొచ్చిందన్నది కపిల్‌ అండ్ కో భావన్‌ అయితే ఈ సారి ఫామ్ పరంగానూ, బలాబలాల పరంగానూ అంచనాలు పెరగడం కాస్త ఒత్తిడికి గురిచేసే అవకాశాలూ లేకపోలేదు. కివీస్‌తో పాటు ఆసీస్‌తోనూ సిరీస్ కోల్పోయినప్పటకీ… ప్రపంచకప్‌లో భారత్‌పై అంచనాలు మాత్రం తగ్గలేదు.

Recommended For You