ఈ నెల 22న అభ్యర్దులతో సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంచ‌నాకు వచ్చేశారా..?

ఏపీలో ఎన్నిక‌లు ముగిసి వారం రోజులు దాటింది.ఫ ‌లితాల‌కు మాత్రం ఇంకా చాలా స‌మ‌యం ఉంది. అయితే చంద్ర‌బాబు ఇప్ప‌టికే పోలింగ్ స‌ర‌ళిని బ‌ట్టి గెలుపుపై ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే పార్టీ త‌రపున పోటీ చేసిన అభ్య‌ర్దుల‌తో నేరుగా మాట్లాడనున్నారు చంద్ర‌బాబు. ఈ నెల 22 న తన నివాసంలో 175 మంది అసెంబ్లీ అభ్యర్దులు, అలాగే 25 మంది ఎంపీ అభ్య‌ర్దుల‌తో భేటీ కానున్నారు. గ‌తంలోనూ చంద్ర‌బాబు అభ్య‌ర్దుల‌తో ఇలా భేటీ అయి ఓవరాల్‌గా ఒక అంచ‌నాకు వచ్చేవారు. ఇప్పుడు సోమ‌వారం అభ్య‌ర్దులందరితో భేటీ అయి విజ‌యావ‌కాశాల‌పై నేరుగా వారితో మాట్లాడి ఒక అంచ‌నాకు రానున్నారు చంద్ర‌బాబు.

పోలింగ్ ముగిసాక చాలా మంది అభ్య‌ర్దులు హాలిడే ట్రిప్‌లో ఉండ‌గా మ‌రికొంద‌రు నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఉండి.. ప్ర‌జానాడిని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్ర‌బాబు మాత్రం పోలింగ్ ముగిశాక కూడా విశ్రాంతి అనేది లేకుండా పాల‌న వ్య‌వ‌హ‌రాలపై అధికారుల‌తో స‌మీక్ష‌లు జ‌రుపుతూనే మ‌రోవైపు పోలింగ్ స‌ర‌ళిపై ఇప్ప‌టికే ఒక అంచ‌నాకు వ‌చ్చారు. అయితే మ‌రింత లోతుగా అధ్య‌యనం చేసేందుకు సోమ‌వారం అభ్య‌ర్దుల‌తో నేరుగా భేటీ కానున్నారు. అయితే పోలింగ్ రోజు నుంచి ఈసి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న చంద్ర‌బాబు… అన్ని నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితుల మధ్య పోలింగ్‌ జరిగేందనేది అడిగి తెలుసుకోనున్నారు. పోలింగ్ రోజు ఈవిఎంలు మొరాయించ‌డం… కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టిడిపి నేత‌లే టార్గెట్ గా జ‌రిగిన దాడులు… అర్ద‌రాత్రి వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌డం వంటి ప‌రిణామాల‌పై నేత‌ల‌తో చర్చించనున్నారు. పోలింగ్‌ రోజున గొడవలతో ప్రజలు ఓటు వేసేందుకు ముందుకు రాకపోయినా.. చంద్రబాబు పిలుపుతో ఓటర్లతో భారీగా తరలివచ్చారు. అయితే ఆ పోలింగ్ టీడీపీకి అనుకూలంగా జ‌రిగిందా లేదా అన్నదానిపై అంచ‌నాకు రానున్నారు చంద్ర‌బాబు.

ఏది ఏమైనా గెలుపుపై చంద్ర‌బాబు పూర్తి ధీమాతోనే ఉన్నారు. అయితే పోటి చేసిన నేత‌ల్లో మాత్రం కొన్ని చోట్ల సందేహాలున్నాయి. మ‌రి సోమ‌వారం రోజు చంద్ర‌బాబు వారంద‌రికీ ఎలాంటి సూచ‌న‌లు చేయ‌బోతున్నారు అనేది అస‌క్తిగా మారింది.