అభ్యర్థుల భవితవ్యంపై చెప్పు అంజనం.. సైకిలా.. ఫ్యానా అంటే..

ఎన్నికలు ముగిశాయి.. అభ్యర్థుల భవితవ్యం తేలడానికి ఇంకా సమయం ఉండడంతో ఎవరు గెలుస్తారా అన్న టెన్షన్ అటు రాజకీయ నాయకుల్లోనూ, పార్టీ శ్రేణుల్లోనూ నెలకొని ఉంది. ఆయా పార్టీల అభిమానులు తమ నాయకుడు గెలవాలని పూజలు చేయించడం.. జ్యోతిష్కుల దగ్గరికెళ్లి జాతకాలు చెప్పించుకోవడం వంటివి చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో అయితే కొందరు వ్యక్తులు ఏకంగా అంజనాలు వేసే వ్యక్తులనే ఆశ్రయించారు. తమ అభ్యర్థి అదృష్టం ఎలా ఉందో తెలుసుకుంటున్నారు.

ఒక చెప్పును జనం మధ్యలో ఉంచి ఇద్దరు మహిళలు అటూ ఇటుగా కూర్చుని వాళ్ల చేతి వేళ్లను చెప్పు పైభాగంలో ఉంచి వేళ్ళపైన పసుపు కలిపిన బియ్యాన్ని, పూలను పోస్తూ సైకిల్ గెలుస్తుందా ఫ్యాను గెలుస్తుందా అంటూ ప్రశ్నలు వేశారు. ఫ్యాను గెలుస్తుందా అని ప్రశ్నించినప్పుడు చెప్పులో ఎలాంటి కదలికలు కనిపించలేదు. సైకిల్ గెలుస్తుందా అని అడిగినప్పుడు చెప్పు కొంత పైకి లేచి గిరగిరా తిరిగి పడిపోతోంది. ఈ పూజలు చేసిన వీడియో ఇప్పుడు వెంకటగిరిలో వైరల్ అవుతోంది .