ఆంధ్రప్రదేశ్

జగన్‌ ప్రమాణస్వీకార వేదికకు గాలివాన ఎఫెక్ట్‌

జగన్‌ ప్రమాణస్వీకార వేదికకు గాలివాన ఎఫెక్ట్‌
X

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్‌ జగన్‌ నేడు నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం వేదికగా జగన్‌ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వైఎస్‌ జగన్‌తో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జగన్‌ ప్రమాణస్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు డీఎంకే అధినేత స్టాలిన్‌ ఇతర ప్రముఖులు హాజరకానున్నారు.

ఇదిలా ఉంటే అర్థరాత్రి విజయవాడలో గాలివాన బీభత్సం జగన్‌ ప్రమాణస్వీకార వేదికపై తీవ్ర ప్రభావం చూపింది. గాలివానకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం తడిసి ముద్దైంది. వీఐపీలసోఫాలు తడిసిపోయాయి. ఫ్లెక్సీలు, కటౌట్‌లు ధ్వంసమయ్యాయి. ప్రమాణస్వీకార ప్రాంగణం మొత్తం చిత్తడిగా మారిపోయింది. ప్రధాన వేదిక పైకప్పు కూడా స్వల్పంగా ధ్వంసం అయ్యింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం మళ్లీ యుద్ధ ప్రాతిపదికనన పునరుద్ధరణ పనులు చేస్తోంది. ప్రమాణస్వీకారానికి మరికొన్ని గంటలే మిగిలి ఉండడంతో ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

మరోవైపు వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది విజయవాడకు బయలుదేరారు. ఉదయాన్నే ఇందిరా గాంధీ స్టేడియానికి పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. జై జగన్‌ అనే నినాదాలతో హోరెత్తించారు. ఇప్పటికే ఇందిరాగాంధీ స్టేడియం జనంతో కిక్కిరిసిపోయింది. దాదాపు 30 వేల మంది స్టేడియంలో కూర్చునే ఏర్పాట్లు చేశారు. వీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలను సిద్ధం చేశారు. మరోవైపు స్టేడియం బయట కూడా జగన్‌ ప్రమాణస్వీకారాన్ని వీక్షించేందుకు అనువుగా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు. ఎండ కాలంలో కావడంతో ప్రజలకు అందించేందుకు మజ్జిగ, వాటర్‌ ప్యాకెట్లను సిద్ధం చేశారు.

విజయవాడలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు ఐదు వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఆర్‌అండ్‌బి ఆఫీసు ప్రాంతంలో వీఐపీల వాహనాలకు, పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో ప్రత్యేక ఆహ్వానితుల వాహనాలకు, బిషప్‌ అజరయ్య స్కూల్, స్టేట్‌ గెస్ట్‌హౌస్, సీఎస్‌ఐ చర్చి ప్రాంతాల్లో అధికారులు, మీడియా వాహనాల పార్కింగ్‌కు కేటాయించారు. సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్, సిద్ధార్థ ఆర్ట్స్‌ కాలేజీ, సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీ మైదానాల్లో సాధారణ ప్రజల వాహనాలకు పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు.

Next Story

RELATED STORIES