9 ఏళ్ల నా కోరిక నెరవేరింది.. - రోజా
మంత్రిపదవులు ఆశించి.. భంగపడ్డ నేతలు ఒక్కక్కరుగా ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారు. నగరి ఎమ్మెల్యే రోజా, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం నివాసానికి వచ్చి కలిశారు. తమ అసంతృప్తిని వెళ్లగక్కినట్టు తెలుస్తోంది. పార్టీ కోసం పనిచేసినా పదవులు దక్కకపోవడంతో కార్యకర్తలు నిరుత్సాహానికి గురైనట్టు జగన్ తో అన్నట్టు తెలుస్తోంది. అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగానే మంత్రిపదవులు ఇవ్వలేకపోయామని భవిష్యత్తులో అవకాశాలు వస్తాయని జగన్ వారికి వివరించారు.
రేపు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశామని ఎమ్మెల్యే రోజా అన్నారు. తాడేపల్లిలో సీఎంతో సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవి రాలేదని.. తాను అసంతృప్తిగా ఉన్నానన్న వార్తల్లో నిజం లేదని.. జగన్ ను సీఎంగా చూడాలన్న 9 ఏళ్ల తమ కోరిక నెరవేరిందన్నారు. పదవుల కోసం తామె పనిచేయలేదన్నారు. మీరంతా కోరుకుంటే మరోసారి మంత్రిపదవి వస్తుందేమో చూద్దామంటూ రోజా ముక్తాయించారు.
అటు మంత్రిపదవి దక్కలేదని అసంతృప్తిగా ఉన్నారంటూ వార్తలు వచ్చిన నెల్లూరు జిల్లాకు చెందిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి కూడా జగన్‌తో సమావేశమయ్యారు. నెల్లూరు జిల్లాలో ప్రజాసమస్యలను, మానిఫెస్టో అమలు విషయంపైనా ముఖ్యమంత్రితో చర్చించామన్నారు. వ్యక్తిగత కారణాలతో కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లడంవల్లే తానే ప్రమాణస్వీకారోత్సవానికి రాలేదన్నారు కాకాణి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com