మంత్రికే శఠగోపం పెట్టిన పీఏ, ఇద్దరు కానిస్టేబుళ్లు

మంత్రికే శఠగోపం పెట్టిన పీఏ, ఇద్దరు కానిస్టేబుళ్లు

మంత్రికే శఠగోపం పెట్టారు .. మంత్రి నకిలీ లెటర్ హెడ్‌లు సృష్టించి అధికారుల బదిలీల్లో చేతివాటం ప్రదర్శించారు. ఇదంతా ఎవరో బయటవారు చేశారనుకుంటే పొరపాటే.. సాక్షాత్తు మంత్రిగారి పీఏ ఇందులో ప్రధాన సూత్రదారి పాత్ర పోషిస్తే.. జిల్లా పోలీసు అధికారుల సంఘం మాజీ అధ్యక్షుడు, మరో కానిస్టేబుల్ ఈవ్యవహారంలో చక్రం తిప్పారు. అయితే ఈ వ్యవహారంలో ఇంతవరకు పోలీసులకు మంత్రి పేషీ నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదట. ఒంగోలు ఎమ్మెల్యేగా ఐదుసార్లు ఆయన గెలుపొందారు. గతంలో వైఎస్‌ మంత్రివర్గంలో ఒకసారి.. ప్రస్తుతం జగన్‌ కేబినెట్‌లో మరోసారి మంత్రిగా కొనసాగుతున్నారు. రాజకీయాల్లో సీనియర్‌గా , వివాదాలకు దూరంగా, సౌమ్యుడుగా పేరొందిన ఆయనే ఏపీ విద్యుత్ , అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు ఆయన మంచి తనమే ఆయన కొంపముంచేలా చేసింది. నమ్మి పనిలో పెట్టుకున్న పర్సనల్ అసిస్టెంట్ నమ్మకద్రోహం చేశాడు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో జతకలిసి మంత్రిగారి లెటర్‌హెడ్‌లను నకిలీవి సృష్టించి మంత్రి ఫోర్జరీ సంతకాలతో ఉద్యోగాల బదిలీల్లో సిఫార్సు లెటర్లు సృష్టించి అందిన కాడికి దండుకున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

మరో వైపు వాళిద్దరూ కానిస్టేబుళ్లే కానీ స్థాయిని మరిచి రెచ్చిపోయారు. మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి పేషీకి సమాంతరంగా మరో వ్యవస్థ నడిపేందుకు ప్రయత్నించారు. మంత్రిగారి పీఏతో జతకలిసి.. ఆయన పరిధిలోని బదిలీలల్లో అంతా తామే అన్నట్లుగా ప్రవర్తించారు. ఎస్సై , సీఐ, డీఎస్పీ, హోదా ఏదైనా సరే మేం చెబితే పోస్టింగ్ పడినట్లేనని విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోనూ పోస్టింగ్‌లు వేయిస్తామని దుకాణం పెట్టేశారు. నకిలీ లెటర్‌ప్యాడ్లు సృష్టించి మంత్రి బాలినేని సంతకాన్నీ ఫోర్జరీ చేశారు. ఈవ్యవహారం ఇప్పుడు బట్టబయలు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది.

వీరు ఎస్సైలు, సిబ్బంది జాబితాతో జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులను కలిశారు. తాము అందజేసిన జాబితాలో ఉన్నా వారికి మీ నియోజకర్గాల్లో పోస్టింగులు లేకుండా చేయాలని కోరారు. వీరి వ్యవహారశైలిని తీవ్రంగా వ్యతిరేకించిన కొందరు ప్రజాప్రతినిధులు.. మా నియోజకవర్గంలో బదిలీలతో మీకేం పనంటూ నిలదీసినట్లు సమచారం. అటు వీరు సిద్ధం చేసిన ఆ జాబితా ఆధారంగా బదిలీలకు మంత్రి బాలినేని సుముఖంగా లేకపోవడంతో ఈ కేటుగాళ్లు వెనుకడుగు వేయలేదు. పోస్టింగ్‌లు వేయిస్తామంటూ జోరుగా ప్రచారం చేసుకున్నారు. అయితే పోలీస్‌శాఖలో బదిలీలు అందుకు భిన్నంగా జరిగాయి. దీంతో ఇతర ప్రభుత్వ శాఖలపై దృష్టిపెట్టారు. మంత్రి పేషికి సమాతరంగా మరో వ్యవస్థను నడిపించారు. బదిలీల పేరుతో బేరసారాలకు తెరతీశారు. ఏకంగా నకిలీ లేఖలు.. ఫోర్జరీలకు దిగారు.

కానిస్టేబుళ్ల దందాపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తీవ్రంగా పరిగణించారు. ఈవ్యహారంపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు రాకపోయినా.. ఈ వ్యవహారంలో కీలక పాత్రలు పోషించిన ఆ ఇద్దరు కానిస్టేబుళ్లపై విచారణకు ఆదేశించారు . ప్రస్తుతం చీరాలలో పనిచేస్తున్న ఎం.వేణుగోపాల్, ఒంగోలు మహిళా పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎన్ వెంకటరెడ్డిని వీఆర్‌కు పిలిపించారు. ఈవ్యవహారంపై సీసీఎస్‌ పోలీసులు గుట్టుగా విచారణచేస్తున్నారు. మరో వైపు ఈ లెటర్‌ హెడ్‌ల స్కాంలో మంత్రిగారి పీఎ, ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు మరికొంతమంది ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story