18 July 2019 3:26 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / సీతయ్య.. ఎవరి మాటా...

సీతయ్య.. ఎవరి మాటా వినడు..

సీతయ్య.. ఎవరి మాటా వినడు..
X

ఉత్తరకొరియా గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. టన్నులకొద్ది అణు బాంబులను పక్కలో పెట్టుకొని...అగ్రదేశాలకు కుణుకు లేకుండా చేస్తున్న దేశం. ఇక ఈ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ సీతయ్య టైపు. ఎవరి మాటా వినడు. తాను అనుకున్నది చేసేస్తాడు. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తాడు. అభివృద్ధిని పక్కన పెట్టి..వినాశనం గురించే ఎక్కువగా ఆలోచిస్తాడు. అందుకే అనేకదేశాలు ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించాయి ఐక్యరాజ్య సమితి కూడా వాణిజ్య ఆంక్షలు కొనసాగిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ఉత్తరకొరియా అష్టదిగ్బంధనంలో ఉంది. అయినా కూడా కిమ్ జోంగ్ ఉన్ కో అంటే కొండమీది కోతి కూడా క్షణాల్లో ఆయన ముందు వచ్చి వాలుతోంది. ఇది ఎలా సాధ్యం ? వాణిజ్య ఆంక్షలు ఉన్నప్పటికీ విలాసవంతమైన బెంజ్ కార్లు ఉత్తరకొరియాకు ఎలా వచ్చాయి? దీనిపైనే అగ్రరాజ్యం అమెరికాతోపాటు ఇతర దేశాలూ జుట్టు పీక్కునేవి..

కిమ్ జోంగ్ ఉన్ ఎప్పుడు చూసినా బెంజ్‌ లిమోసిన్‌, రోల్స్‌రాయిస్‌లో దర్శనమిస్తుంటారు. వాణిజ్య ఆంక్షలు ఉన్నప్పటికీ ఈ బెంజ్ కార్లు ఉత్తరకొరియాకు ఎలా వచ్చాయో తేల్చేందుకు అమెరికాకు చెందిన ది సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ డిఫెన్స్‌ స్టడీస్‌ అనే ఒక సంస్థ పరిశోధన చేపట్టింది. కిమ్‌ కార్ల వెనుక ప్రపంచ స్థాయిలో పెద్ద నెట్‌వర్క్‌ ఉందని గుర్తించింది. ఐదు దేశాలను ఉపయోగించుకొని ఈ కార్లను ఉత్తర కొరియాకు తరలించినట్లు తేల్చింది. అంటే ఎవరెన్ని ఆంక్షలు పెట్టినా... కిమ్ జోంగ్ ఉన్ తాను చేయాలనుకున్నది చేసేస్తున్నాడు..

కిమ్‌కు చేరాల్సిన రెండు మెర్సిడెస్‌ కార్లను 2018 జూన్‌ 14వ తేదీన రెండు కంటైనర్లలో లోడ్‌చేసి నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌ ఓడరేవుకు చేర్చారు. ఈ కార్లు 41రోజుల తర్వాత జులై 31న చైనాలోని దలియన్‌ ఓడరేవుకు చేరాయి. ఆ తర్వాత జపాన్‌, బుసాన్‌ మీదుగా రష్యాలోని వ్లాదివాస్తోక్‌ కు అక్టోబర్ 7న వచ్చాయి. అదే రోజున అమెరికా విదేశాంగశాఖ కార్యదర్శి మైక్‌ పాంపియోతో సమావేశం అయ్యేందుకు ఈ కొత్త కార్లలో ఒకటైన రోల్స్‌రాయిస్‌ను బయటకు తీశాడు కిమ్. ఆ తర్వాత ఉత్తరకొరియా విమానాలు బెంజ్‌ లిమోసిన్‌, రోల్స్ రాయిస్ కార్లను లోడ్‌ చేసుకొని ప్యాంగ్‌యాంగ్‌ దిశగా రివ్వున ఎగిరిపోయాయి. జనవరి 31న ఇవే బెంజి కార్లలో కిమ్‌ ఠీవీగా ప్యాంగ్‌యాంగ్‌ వీధుల మీదుగా తన ఆఫీసుకు వెళ్లారు. ఇలా అత్యంత పటిష్టమైన నిఘా, ఉపగ్రహాల డేగ కళ్లను కప్పిమరీ చాలా చాకచక్యంగా బెంజ్ కార్లు చేరాల్సిన చోటుకి చేరిపోయాయి. దటీజ్ కిమ్ జోంగ్ ఉన్..

ఉత్తరకొరియాకు కార్లను రవాణ చేయడంలో జపాన్‌, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్‌ వంటి అమెరికా మిత్రదేశాల భూభాగాన్ని కూడా వాడుకున్నాడు కిమ్. 2015-17 మధ్యలో కిమ్‌ బృందం ఏకంగా 90 దేశాల నుంచి విలాసవంతమైన వస్తువులను దిగుమతి చేసుకొన్నట్లు అంచనా. ఇలాంటి దొంగ మార్గాల్లోనే ఉ.కొరియా అణు టెక్నాలజీ, ఇంధనాలను కూడా తెప్పిస్తోందన్నది అమెరికా డౌట్. అంటే ఉత్తరకొరియా అనుసరిస్తున్న ఈ అడ్డదారికి చెక్ పెడితే.. ఆ దేశానికి అణుటెక్నాలజీని కూడా దూరం చేయవచ్చన్నది అగ్రరాజ్యం ప్లాన్ గా కనిపిస్తోంది. కానీ తిమ్మినిబమ్మిచేసే కిమ్ ముందు అమెరికా ఎత్తులు ఫలిస్తాయా అన్నదే అసలు ప్రశ్న.

Next Story