ఆంధ్రప్రదేశ్

మా పార్టీ ఆఫీస్ నిర్మాణం నిలిచిపోయింది : పవన్ కళ్యాణ్

మా పార్టీ ఆఫీస్ నిర్మాణం నిలిచిపోయింది : పవన్ కళ్యాణ్
X

క్షేత్రస్థాయి నుంచి జనసేన బలోపేతంపై మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. ఇందులో పవన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తనపై అనవసరంగా బురద జల్లుతున్నారని, పొత్తులు కావాలనుకుంటే ఎవరితో అయినా కలవగలను అని స్పష్టం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారన్న ఆరోపణలను కొట్టిపారేశారు. టీడీపీతో కలిసి పోటీ చేయాలనుకుంటే తనను అపేదెవరని ప్రశ్నించారు.‌ ఒక ఆశయానికి కట్టుబడి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పోటీ చేశామన్నారు. అది నమ్మకపోతే అది వాళ్ల సమస్య తప్ప తనది కాదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత చాలా తీవ్రంగా ఉందన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఇసుక దొరక్క.. తమ పార్టీ ఆఫీస్ నిర్మాణం కూడా నిలిపోయిందని అన్నారాయన. సీఎం జగన్ చాలా విషయాలపై నిర్భయంగా మాట్లాడగలిగినప్పుడు .. మాటమీద నిలబడే తాను దానికి పదింతలు ధైర్యంగా మాట్లాడగలనన్నారు.

మంగళవారం సాయంత్రం కాకినాడ పార్లమెంటు పరిధిలో నేతలతో పవన్‌ సమావేశం అయ్యారు. తన తొలి సినిమా ఫ్లాప్ అయినప్పుడు కూడా అందరూ హేళన చేశారని పవన్ గుర్తు చేశారు. అయితే ఓడిన చోటే గెలుపు సాధించడం తనకు అలవాటేనని, ఓర్పుతో ఉంటూ ప్రజా సమస్యల పై స్పందిస్తూ ఉంటే... ప్రజలే పట్టం కడతారన్నారు. లక్షలాది మందితో చప్పట్లు కొట్టించుకునే స్థితిలో ఉండి కూడా నెలల తరబడి టీవీల్లో ఎవడు పడితే వాడు తిడుతుంటే భరించడం తనకు సరదా కాదన్నారు. పార్టీ నిర్మాణం, కమిటీలు వేయకపోవడానికి కారణం కూడా తనను అర్ధం చేసుకునే వ్యక్తుల కోసం ఎదురు చూడటమే తప్ప.. చేతకాక కాదన్నారు. చాలా వరకు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులనే నియోజకవర్గ ఇంఛార్జులుగా నియమిస్తామని, బూత్ కమిటీలు వేసే బాధ్యతలు అప్పగిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వానికి తాము వంద రోజుల సమయం ఇస్తున్నట్టు పవన్ చెప్పారు. ఆ తర్వాత జగన్ పాలనపై స్పందిస్తామని అన్నారాయన. ప్రజా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే.. ఆందోళనకు సిద్ధమవ్వాలని కేడర్‌కు, లీడర్‌కు పవన్ సూచించారు.

జనసేన గెలుపు కోసం మండలస్థాయిలో పని చేసిన ప్రతి ఒక్కరిని 25 పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాల అనంతరం వ్యక్తిగతంగా కలుస్తానని పవన్ చెప్పారు. జనసైనికులపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. దాడులు, కక్షపూరితంగా కేసులు పెడితే డీజీపీ, హోంమంత్రి, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామన్నారు. స్పందించని పక్షంలో రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేస్తామని పవన్ హెచ్చరించారు.

Next Story

RELATED STORIES