బందరు పోర్టు పై ఏపీ సర్కార్‌ సంచలన నిర్ణయం

బందరు పోర్టు పై ఏపీ సర్కార్‌ సంచలన నిర్ణయం

ఎన్నో అవాంతరాల మధ్య ఎట్టకేలకు పనులు ప్రారంభమైన దశలో బందరు పోర్టు కథ మళ్లీ మొదటికి వచ్చింది. నవయుగ సంస్థ ప్రధాన ప్రమోటర్‌గా ఉన్న మచిలీపట్నం పోర్టు లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పోర్టు నిర్మాణం కోసం ఎంపీపీఎల్‌కు లీజుపై ఇచ్చిన 412.57 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. బందరు పోర్టు నిర్మాణం కోసం గత 11 ఏళ్లుగా కన్సార్షియం శ్రద్ధ చూపించలేదని... పలుమార్లు గడువు పెంచినా పట్టించుకోలేదు అని జీవోలో స్పష్టం చేశారు. అంతేకాదు దశాబ్ద కాలంగా పోర్టు పనులు ప్రారంభించకపోవడం వల్ల ప్రభుత్వానికి కలిగిన నష్టాన్ని వసూలు చేసే హక్కు కూడా ఉంటుందని జీవోలో పేర్కొన్నారు.

2017 మార్చి నెలలో 3010 ఎకరాల అసైన్డ్‌, ప్రభుత్వ భూమిని సమీకరించి కాకినాడ పోర్టు డైరెక్టర్‌కు అప్పగించారు. పోర్టు అభివృద్ధి కోసం 2016లో మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కూడా ఏర్పాటు చేశారు. ముడా ఆధ్వర్యంలో భూసమీకరణ, సేకరణ ప్రక్రియ చేపట్టారు. పోర్టుకు అవసరమైన ప్రైవేటు భూమిని ఎకరం 25 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన అప్పటి సీఎం చంద్రబాబు తపసిపూడి వద్ద పోర్టు పనులను ప్రారంభించారు. నవయుగ సంస్థ ప్రాజెక్టు స్థలం వద్దకు భారీ యంత్రాలను తరలించి... పనులను కూడా ప్రారంభించింది. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో... పనులు కూడా ఆగిపోయాయి. ఇప్పుడు ఒప్పందాన్నే రద్దు చేసుకోవడంతో బందరు పోర్టు కథ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది.

ఒప్పందం రద్దుకు కారణాలను జీవోలో వివరించింది ప్రభుత్వం. బందరులో పోర్టు నిర్మించాలని 2008లో నాటి వైఎస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పోర్టు నిర్మాణ బాధ్యతలను మైటాస్‌ ఇన్‌ఫ్రా-ఎన్‌సీసీ-ఎస్‌ఆర్‌ఈఐ-ఎస్‌సీపీ కన్సార్టియంలకు అప్పగించారు. ఈ కన్సార్టియం వజ్రా సీపోర్టు ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఒక ఎస్పీవీని రిజిస్టర్‌ చేసింది. ఈ ఎస్పీవీతో ప్రభుత్వం 2008 ఏప్రిల్‌ 21న ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం 12 నెలల్లో ఈ ప్రాజెక్టు ఫైనాన్సియల్‌ క్లోజర్‌ పూర్తి చేయాలి. అదే సమయంలో మైటాస్‌ ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. ఎస్‌ఆర్‌ఈఐ, ఎస్‌సీపీలు కూడా కన్సార్షియం నుంచి తప్పుకున్నాయి. దీంతో పోర్టు పనులను ముందుకు తీసుకెళ్లేందుకు 2010 ఏప్రిల్‌ 15న నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ను లీడ్‌ ప్రమోటర్‌గా చేర్చుకోవడానికి అనుమతించాలని సదరు కన్సార్షియం ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు సర్కారు అంగీకరించింది. 2010 జూన్‌ 7న దీనిపై మరో ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత పలుమార్లు ఫైనాన్షియల్‌ క్లోజర్‌కు గడువు పొడిగిస్తూ వెళ్లారు. అయినా పనులు మాత్రం జరగలేదు. అయితే ఇటీవలే పనులు ప్రారంభించేందుకు నవయుగ సిద్ధమవుతున్న తరుణంలో బందర్‌ పోర్టు ఒప్పందం రద్దు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story