దేశవ్యాప్తంగా నిరసనలు... రంగంలోకి దిగిన బీజేపీ జాతీయ నాయకత్వం
పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో... బీజేపీ జాతీయ నాయకత్వం రంగంలో దిగింది. దేశ ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో సభలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, గద్వాలలో సీఏఏ మద్దతు సభలు, ర్యాలీలు జరిగాయి. విపక్షాల ఆరోపణలను నేతలు తిప్పికొట్టారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు...
CAA ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి. విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. సర్కారు ఆస్తులను ధ్వంసం చేసిన వారి ఆస్తులు కూడా జప్తు చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన CAA మద్దతు సభలో బీజేపీ శ్రేణులుపెద్ద ఎత్తున పాల్గొన్నాయి.
తెలంగాణలో సీఎం కేసీఆర్ మజ్లిస్ ఎజెండాను అమలు చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. CAA,NRCపై వాళ్లిద్దరూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
కరీంనగర్‌లో CAAకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. తెలంగాణ చౌక్ నుంచి మొదలైన ర్యాలీలో ఎంపీ బండి సంజయ్‌తో పాటు ఇతర బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు. గద్వాలలో జరిగిన సభకు మరో కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ హాజరయ్యారు..
ఆదిలాబాద్‌లో ఎంపీ సోయం బాపూరావు ఆధ్వర్యంలో మెగా ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి మొదలైన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కొందరు మజ్లిస్ జపం చేస్తున్నారని ఎంపీ బాపూరావు ఆరోపించారు..
ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ నడుస్తోంది. ఇదే సమయంలో CAA మద్దతు సభలతో జనంలోకి వెళ్తోంది బీజేపీ. అధికార పార్టీకి గట్టిపోటీ ఇవ్వడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ స్థానాలు గెలిచిన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. వీలైనన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో పాగా వేయాలని భావిస్తోంది కమలదళం. అందుకే సీఎంతోపాటు మజ్లిస్‌నూ టార్గెట్ చేస్తూ హీట్ పెంచేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com