రాజధాని మార్చే అధికారం సీఎంకు ఉందా? : చంద్రబాబు

రాజధాని మార్చే అధికారం సీఎంకు ఉందా? : చంద్రబాబు

chandrababu

రాజధాని ప్రాంతంలో పరిస్థితులపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తనను కలిసేందుకు వచ్చిన స్టూడెంట్ జేఏసీ నేతలతో అమరావతిలో మాట్లాడిన ఆయన.. జగన్‌ పాలనపై నిప్పులు చెరిగారు. ఏపీ రాజధాని ఏదంటే ఏ పేరుతో మొదలుపెట్టి ఏ పేరుతో ముగించాలో అర్థం కాని రిస్థితి నెలకొందని అన్నారు. అలాగని రాజధాని మార్చే అధికారం సీఎంకు ఉందా? అంటే అదీ లేదని చంద్రబాబు విమర్శించారు..

అమరావతి ప్రాంత మహిళలపై పోలీసు జులుం ప్రదర్శించడంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాజధానికి భూములిచ్చిన వారిపై దౌర్జన్యం చేయడం దారుణమన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై పోలీసులు ప్రతాపం చూపిస్తారా అని మండిపడ్డారు. రైతులపైకి పోలీసుల వాహనాలను నడిపి గాయాల పాలు చెయ్యడం అప్రజాస్వామికమన్నారు.

స్వాతంత్ర్యం వచ్చాక ఎందరో సీఎంలు వచ్చారు కానీ ఎవరూ రాజధాని మార్చుతామని చెప్పలేదని.. అప్పుడెప్పుడో తుగ్లక్ మార్చాడు. ఇప్పుడు జగన్‌ ఆ పని చేస్తున్నారని ఎద్దేవ చేశారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేశారని మండిపడ్డారు. రాజధాని మార్పుకోసం కమిటీల మీద కమిటీలు వేశారని.. రాజధాని అంటే ఏదో ఆఫీసులు పెట్టుకోవడానికి కాదు, యువత భవిష్యత్తు తీర్చిదిద్దే ప్రాంతంగా ఉండాలని అన్నారు..

ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం రాజధాని నిర్ణయం ఎప్పుడో జరిగిపోయిందని తెలిపారు. 45 రోజుల్లో రాజధానిని నిర్ణయించుకునేందుకు శివరామకృష్ణ కమిటీ వేశారని, అటు ఆరు జిల్లాలు, ఇటు ఆరు జిల్లాల మధ్యన ఉన్న ఏడో జిల్లాలో రాజధాని ఏర్పాటు చేసుకున్నామని చంద్రబాబు వివరించారు. అద్భుతమైన రాజధాని నిర్మించాలనే లక్ష్యంతో తాను అమరావతిని ఏర్పాటు చేస్తే.. సీఎం జగన్‌ ఆ బ్రాండ్‌ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Next Story