మహిళలపై పోలీసుల దమనకాండ

మహిళలపై పోలీసుల దమనకాండ

police-vs-women

విజయవాడ రణరంగమైంది. బెంజ్‌ సర్కిల్, బందరు రోడ్డు యుద్ధభూమిని తలపించాయి. మహిళలపై పోలీసులు దమనకాండ ప్రదర్శించారు. అత్యంత నీచంగా ప్రవర్తించారు. రోడ్లపై కనిపించడమే నేరం అన్నట్లుగా ప్రవర్తించారు. దొరికిన వారిని దొరికిటన్లుగా ఈడ్చిపడేశారు. ఏకంగా ఆర్టీసీ బస్సులు పెట్టి మరీ అరెస్టులు చేశారు. మహిళలు అని కూడా చూల్లేదు. ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మహిళలను...మహిళా పోలీసులే అరెస్ట్ చేయాలన్న ప్రాథమిక అంశాన్ని కూడా పట్టించుకోలేదు. మగ పోలీసులే మహిళా ఆందోళనకారుల్ని ఈడ్చుకెళ్లారు. నీచంగా ప్రవర్తించారు. తాకరాని చోట తాకారు. కొందరి వస్త్రాలు కూడా చింపివేశారంటే దౌర్జన్యకాండ ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు.

బెజవాడలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపించాయి. అప్రకటిత కర్ఫ్యూ విధించారు. అన్ని కూడళ్లను దిగ్బంధం చేశారు. వందల సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు. అమరావతి కోసం స్వచ్చంధంగా రోడ్లపైకి వచ్చిన మహిళలను టెర్రరిస్టుల మాదిరిగా ట్రీట్ చేశారు. ఎక్కడికక్కడ అడ్డుకొని... వ్యాన్లు, బస్సుల్లో కుక్కిపడేశారు. మగవాళ్లు, ఆడవాళ్లు అన్న తేడా లేకుండా అందరినీ ఒకే వాహనంలో ఎత్తిపడేశారు.

బెంజ్‌ సర్కిల్‌ వద్ద హై టెన్షన్‌ నెలకొంది. అమరావతి జేఏసీకి సంబంధం లేని మహిళలను కూడా అరెస్ట్ చేస్తూ అరాచకం సృష్టించారు పోలీసులు. షాపింగ్‌ కోసం, పనిమీద బయటకు వచ్చిన మహిళలను సైతం అరెస్టులు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, మహిళలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. అరెస్టులను తీవ్రంగా ప్రతిఘటించారు.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం నిర్బంధం అంటూ ఫైర్‌ అయ్యారు. కనీసం రోడ్లపైకి కూడా రాకుండా నిర్బంధిస్తారా అంటూ ప్రశ్నించారు. ఇళ్లలోంచి బయటకు వస్తే చాలు అరెస్టులు చేస్తారా అని నిలదీశారు.

అమరావతికి మద్దతుగా బందరు రోడ్డులోనూ మహిళలు కదం తొక్కారు. నిరసన ప్రదర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో మహిళా లాయర్లు పెద్దయెత్తున నిరసన చేపట్టారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు.

ఈ అరాచకాలన్నింటినీ ప్రపంచానికి చూపిస్తున్న మీడియాపైనా పోలీసులు జులుం చూపించారు. అక్రమంగా మహిళలను అరెస్టు చేస్తున్న తీరును ప్రశ్నించిన టీవీ5 రిపోర్టర్‌పై కూడా దౌర్జన్యం ప్రదర్శించారు. అరెస్టు చేస్తున్న ఘటనను చిత్రీకరించుకుండా నెట్టివేశారు.

Read MoreRead Less
Next Story