28 Jan 2020 10:05 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / సభలో అనుసరించాల్సిన...

సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం

సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం
X

జగన్ ప్రభుత్వ తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది టీడీపీ. రాజధాని మార్పు, 3 రాజధానుల ప్రకటన, మండలి రద్దు, ఉపాధి హామీ పథకం నిధుల మళ్లింపు, మీడియాపై ఆంక్షలు, పోలవరం పనుల నిలిపివేత, టీడీపీ నేతలపై అక్రమ కేసులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ అంశాలపై చర్చించారు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతుండటంతో.. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు.

మండలి రద్దు జగన్ కుటుంబ వ్యవహారం కాదన్నారు ఎంపీ కనకమేడల. కేసులు ఎక్కువగా ఉన్నాయని రేపు కోర్టులను కూడా రద్దు చేస్తామంటారా అని ప్రశ్నించారు? వికేంద్రీకరణ బిల్లు, CRDA రద్దు బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపితే జగన్ మనసుకు బాధ కలిగిందా అంటూ ఎద్దేవా చేశారు? మండలి రద్దు జరిగేపని కాదన్నారు కనక మేడల. ఇప్పటికే పలు రాష్ట్రాలకు సంబంధించిన విజ్ఞప్తులు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానం కూడా అదే స్టాండింగ్‌ కమిటీ ముందుకు వెళ్తుందని చెప్పారు.

రాజధాని మార్పుకు ప్రజల ఆమోదం లేదన్నారు మరో ఎంపీ గల్లా జయదేవ్.. 42 రోజులుగా రైతులు ఆందోళన చేస్తుంటే సీఎం గానీ, మంత్రులుగానీ ఎందుకు కలవలేదని ప్రశ్నించారు..6 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయని అన్నారు. 3 రాజధానుల ప్రయోగం విఫలమైందని ...సౌతాఫ్రికా ప్రతినిధులు చెబుతున్నా ప్రభుత్వానికి వినపడటం లేదా అని నిలదీశారు జయదేవ్. తీవ్రవాదులు, నక్సలైట్లపై పెట్టే కేసులు రైతులపై

పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధి హామీ బిల్లుల పెండింగ్ అంశాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు జగన్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే బిల్లులు నిలిపివేసిందని ఆరోపించారు. కేంద్రం, హైకోర్టు చెప్పినా నిధులు విడుదల చేయడం లేదని ఆరోపించారు.

Next Story