రాష్ట్రాన్ని నాశనం చేసేందుకే మూడు కమిటీలు :చంద్రబాబు
అధికార వికేంద్రీకరణతో అభివృద్ధి జరగదని.. పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. 3 రాజధానులు పెట్టడానికి సీఎంకు ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. కర్నూలు అభివృద్ధి చేస్తామంటే సహకరిస్తామన్న చంద్రబాబు.. ఉత్తరాంధ్ర ద్రోహి జగనే అని విమర్శించారు.
రాజధాని తరలింపుపై హైకోర్టు చెప్పిన తర్వాత కూడా జీవోలు ఎందుకు జారీ చేశారని ప్రశ్నించారు చంద్రబాబు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా అర్థరాత్రి కార్యాలయాలు ఎందుకు తరలించాల్సి వచ్చిందన్నారు. ఇది కోర్టు ధిక్కారం కాదా? అని నిలదీశారు. ఏపీ ప్రభుత్వ సలహదారు అజేయ కల్లాంపై విరుచుకుపడ్డారు చంద్రబాబు. తిరుపతిలో జరిగిన సభలో కల్లాం రాజకీయ నేతగా మాట్లాడారని.. ఇష్టానుసారం నోరు పారేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీఏల విషయంలో అజేయ కల్లాం, రమేష్ కలిసి తప్పుడు డాక్యుమెంట్లు ఇచ్చారని ఆరోపించారు
ఏపీ రాజధాని అమరావతిని చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకే రాజధానిపై మూడు కమిటీలు వేశారని నిప్పులు చెరిగారు. విశాఖలో పెద్ద ఎత్తున భూములు చేతులు మారాయని ఆరోపించారు టీడీపీ అధినేత. ఆ రోజు అమరావతిలో ల్యాండ్ పూలింగ్ చేస్తే తప్పన్న వైసీపీ నేతలు.. విశాఖలో ఇప్పుడెందుకు భూసమీకరణ చేపట్టారని విమర్శించారు. విశాఖలో జరిగే భూ కుంభకోణాలు త్వరలో బయటకు వస్తాయిన్నారు చంద్రబాబు.
మీడియాపై అక్రమ కేసులను చంద్రబాబు ఖండించారు. మీ అక్రమాలను, దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే మీడియాపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ప్రజా గొంతుకను వినిపిస్తున్న టీవీ5 ప్రతినిధులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని అన్నారు. జగన్ నాలుగేళ్లు ఉంటాడు, పోతాడు.. భావితరాల భవిష్యత్ ఏమవుతుంది? విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకునే అధికారం మీకు ఎవరిచ్చారు? అని వైసీపీ ప్రభుత్వాన్ని కడిగేశారు చంద్రబాబు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com