బంగ్లాదేశ్ చెర నుంచి విడుదలై విశాఖ చేరుకున్న మత్స్యకారులు

బంగ్లాదేశ్ చెర నుంచి విడుదలై విశాఖ చేరుకున్న మత్స్యకారులు

బంగ్లాదేశ్ చెర నుంచి విడుదలైన తిప్పలవలసకు చెందిన 8 మంది మత్స్యకారులు విశాఖకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం కోల్కతా నుంచి ఈస్ట్ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖకు చేరుకున్న మత్స్యకారులు 12 గంటల ప్రాంతంలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. గత ఏడాది అక్టోబరు 2న విశాఖ నుంచి చేపల వేటకోసం బోటులో బయలుదేరిన మత్స్యకారులు.. మార్గమధ్యంలో బోటు చెడిపోవడంతో వారు బంగ్లాదేశ్ సముద్రతీరంలోకి ప్రవేశించారు. ఈనేపథ్యంలో.. ఆ దేశ భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.

జనవరి 29న బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన మత్స్యకారులు బోటులో విశాఖకు తిరుగుపయనమయ్యారు. అయితే.. తమ బోటు మరమ్మత్తులకు గురై మొరాయించడంతో నాలుగు రోజుల పాటు అక్కడే వుండిపోవలసి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు చూపిన చొరవతో ఆ బోటును అక్కడే వదిలిపెట్టి మత్స్యకారులను ఫిబ్రవరి 2న కోల్కతాకు తీసుకువచ్చారు. అనంతరం.. మన రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు అక్కడికి చేరుకొని వారిని విశాఖకు తీసుకుని వచ్చారు. పలుమార్లు బంగ్లాదేశ్‌కు వెళ్లి మత్స్యకారులను విడిపించడంలో ఎంతో సహకరించిన విశాఖకు చెందిన మత్స్యకార నాయకుడు వాసుపల్లి జానకిరాంను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అప్పలనాయుడు ఘనంగా సత్కరించారు.

బాధిత 8 మంది మత్స్యకారులకు ఆర్ధిక ప్యాకేజీ అందించేందుకు మత్స్యశాఖ కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని విశాఖ జిల్లాకలెక్టర్‌ తెలిపారు. వారం రోజుల్లో సహాయం మంజూరయ్యే అవకాశం వుందన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలకు తావులేకుండా జిల్లాలోనే మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story