ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

సీఎం జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నాని కేబినెట్‌ నిర్ణయాలు వెల్లడించారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టంలో పలు సవరణలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనిపై ఆర్డినెన్స్‌ తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇక, మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 15 రోజుల్లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా చట్టంలో మార్పులు తీసుకువస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఎన్నికల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పంచాయితీ రాజ్‌ చట్టంలో సవరణలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పంచాయితీ ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తులు గ్రామాల్లో ఉండేలా, గ్రామ అభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో రోజువారీ పాల్గొనేలా కొన్ని సవరణలు చేశారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రచారానికి 5 రోజులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి 8 రోజులు గడువును విధించామని మంత్రి పేర్ని నాని తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం బాధ్యత ఇకపై ఆ గ్రామ సర్పంచ్‌లదే అని స్పష్టం చేశారు.

ఇక, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ ఏర్పాటుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఈ కౌన్సిల్ ద్వారా వ్యవసాయ, ఉద్యానవన రంగాల్లో ఉత్తమ పద్దతులకు తోడ్పాటునివ్వనున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇరిగేషన్‌ టెక్నాలజీతోపాటు.. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్, నాణ్యమైన విధానాలపై కౌన్సిల్‌ రెగ్యులేటింగ్‌ మెకానిజంగా పనిచేయనుంది.

అటు ఏపీ స్టేట్ ఫైనాన్సియల్ లిమిటెడ్ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిని నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ గా ఏర్పాటు చేయనున్నారు. మిగులు నిధులు సక్రమంగా వినియోగమయ్యేలా ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌ సూచనలు చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఏర్పాటుకు కూడా కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జెన్కో ఆధ్వరంలో 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మంత్రి పేర్ని నాని చెప్పారు. రైతుల ఉచిత విద్యుత్‌ కోసం 8వేల కోట్లు కేటాయించామని తెలిపారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కోసం 1500 కోట్ల సబ్సిడీని చెల్లించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు.

అటు జగనన్న విద్యాకానుక పథకం ద్వారా ఒకటి నుంచి పదవ తరగతి విద్యార్థులకు బ్యాగులతో పాటుగా మూడు జతల దుస్తులు, రెండు జతల బూట్లు, నోటు పుస్తకాలు ఇచ్చే అంశంపై మంత్రివర్గం చర్చించింది.

Tags

Next Story