74వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

74వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

అమరావతి ఉద్యమం 74వ రోజుకు చేరింది. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశారు రాజధాని రైతులు. మందడం, తుళ్లూరు, వెలగపూడి, పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డులో నిరసనలు హోరెత్తాయి. దీక్షా శిబిరాల్లోనే కూర్చుని రాజధాని కోసం అలుపెరుగని అపోరాటం చేస్తున్నారు రైతులు. ఉద్యమాన్ని ఎంత అణచాలని కుట్ర చేసినా.. వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేస్తున్నారు. ప్రాణాలు పోయినా ఉద్యమాన్ని ఆపేది లేదని తెగేసి చెబుతున్నారు. ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు దమన నీతిని ఎండగడుతున్నారు.

రాజధానిని మారుస్తామని జగన్ మేనిఫెస్టోలో ఎందుకుపెట్టలేదని నిలదీశారు రైతులు. ప్రతిపక్షంలోఉన్నప్పుడు అమరావతికి జై కొట్టినజగన్ ..అధికారంలోకి రాగానే మాట తప్పారు.. మడమ తిప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్మశానం, ముంపుప్రాంతం అంటున్న మంత్రులు మరి అదే ప్రాంతంలో పేదలకు ఇళ్లస్థలాలు ఎలా ఇస్తారని సూటిగా ప్రశ్నించారు.

మరోవైపు ఈ పోరాటంలో అలసిపోయి రైతులు అసువులుబాస్తున్నారు. మందడంలో ఓ రైతు, ఎర్రబాలెంలో మరో మహిళా రైతు గుండె ఆగిపోయింది. రాజధానిని కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమంటున్నారు. రైతులతో కన్నీళ్లు పెట్టించిన ప్రభుత్వాలు ఎప్పుడూ బాగుపడలేదన్న విషయాన్ని జగన్ గుర్తించుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం వెనక్కు తగ్గే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story