79వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

79వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

అమరావతి రాజధాని ఉద్యమం 79వ రోజుకు చేరింది. రోజురోజుకీ ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. మండుటెండను సైతం లెక్కచేయకుండా రైతులు, మహిళలు పోరాటం కొనసాగిస్తున్నారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వరుసగా 78వ రోజూ 29 గ్రామాల్లోనూ నిరసనలు హోరెత్తాయి. మందడం, తుళ్లూరులో మహాధర్నాలు.. వెలగపూడిలో రిలే దీక్షలు కొనసాగాయి. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులోని శిబిరాలు జై అమరావతి నినాదాలతో దద్దరిల్లాయి. 151 మంది ఎమ్మెల్యేలతో సీఎం జగన్ మెరుగైన పాలన చేస్తారనుకుంటే..తమ జీవితాలు రోడ్డున పడేశారంటూ ఫైర్ అయ్యారు రైతులు.

అమరావతికి మద్దతుగా మైనార్టీలు సైతం పెద్దయెత్తున ఉద్యమిస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. మందడంలో చర్చి ఫాదర్లు, క్రిస్టియన్లు క్యాండిల్ ర్యాలీ నిర్వమించారు. మందడం మహిమ ప్రార్థనా మందిరం నుంచి ప్రారంభమైన ర్యాలీకి క్రిస్టియన్లు పెద్దయెత్తున తరలివచ్చారు. గత మూడు రోజులుగా అమరావతి కోసం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఫాదర్లు.. క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.

మందడంలో రైతులు మాస్క్‌లు ధరించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రపంచమంతా కరోనాతో బాధపడుతుంటే..తాము జగన్‌ వైరస్‌తో బాధపడుతున్నామని విమర్శించారు. జగన్ తన స్వార్ధం కోసమే మూడు రాజధానులు అంటున్నారని మండిపడ్డారు. మంత్రులు తమ‌ శిబిరాలకు ఎందుకు రావడం లేదని నిలదీశారు రైతులు.. తుళ్లూరులో మహిళలు ఆందోళనలతో హోరెత్తించారు. గరిటలతో పళ్లెంపై కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ ఆవేదన పట్టించుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత గుడ్డి,చెవిటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు.

Tags

Next Story