'పలాస 1978' రివ్యూ

పలాస 1978 రివ్యూ

తారాగణం : రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్,

సంగీతం : రఘు కుంచె

సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్

నిర్మాత : ధయన్ అట్లూరి

దర్శకత్వం : కరుణ కుమార్

అట్టడుగు బ్రతుకుల కన్నీటి కథ. ఊరి చివరి మనుషులు ఊరి పెద్దల ముందు చేతులు కట్టుకుని నిలబడి తమ అస్తిత్వాన్ని కోల్పోయారని దర్శకుడు చెప్పినా.. ఆ కథ నేటికీ మారలేదు. ఆ విషయాన్నే 1978 నుంచి నేటి రోజు వరకూ జరిగిన కథగా చెబుతూ.. ఓ అద్భుతాన్నే ఆవిష్కరించాడు. కుల సంఘాల పేరుతో, బలనిరూపణలు చేసుకుంటూ బ్రతుకంతా బానిసలుగా మారుతోన్న జాతికి చేసిన హెచ్చరిక ఈ పలాస 1978 సినిమా. రాజకీయ నేతల చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతూ.. జాతిని తాకట్టు పెడుతూ.. ఆ జాతి యువతను నిర్వీర్యం చేస్తోన్న దళారుల బ్రతుకులూ ఎండగట్టిన సినిమా.

అలాగని ఇందులో అగ్రవర్ణాలను తిట్టలేదు. ‘అగ్ర కులపోడు’ అంటూ సినిమాటిక్ డైలాగులుండవు. వారిలోని ‘కొందరి’ నైజాన్ని మాత్రం నగ్నంగా చూపించాడు దర్శకుడు. ఇలాంటి నగ్ననాయకులు నేటికీ ఆ జాతి జనాలను కీలుబొమ్మలుగా ఆడించడం మానలేదు. వేషధారణ మారి ఉండొచ్చేమో ఆ కీలుబొమ్మలు కూడా మారలేదు. బ్రతుకంతా అగ్రజాతోనికి ఊడిగం చేయడానికే అన్నట్టుగా గులామ్ గిరీ చేస్తున్నారు. సినిమాలో అప్పుడు హత్యలు చేశారు. ఇప్పుడు మరో తరహాలో వెళుతున్నారు. రూపం ఏదైనా నష్టం ఈ కడ జాతికే.

అసలు ఇలాంటి సినిమా తెలుగు తెరపై చూస్తామా..? అనుకున్నవాళ్లకు.. ఖచ్చితంగా చూస్తారు అని ఓ బలమైన కథ, కథనంతో వచ్చాడు దర్శకుకడు కరుణ కుమార్. శ్రీకాకుళం జిల్లా పలాసలో తను చూసిన, తనకు తెలిసిన సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ అని చెప్పినా.. ఈ కథ జరగని ఊరు ఈ దేశంలోనే లేదు. దేశం మొత్తం ఈ కథ ఏదో రూపంలో జరిగే ఉంది.. జరుగుతూనే ఉంది. అందుకే పలాస 1978లో అనేక సన్నివేశాలు హృదయాన్ని బరువెక్కిస్తాయి.

అలాగని ఇదేమీ డాక్యుమెంటరీ తరహా సినిమా కాదు. తమిళ దర్శకుడు వెట్రిమారన్ తరహాలో ఓ బలమైన పాయింట్ ను అద్భుతమైన కమర్షియల్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి చెప్పిన సినిమా. అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఊపేసే పాటలూ అదనపు ఆకర్షణ. మాస్ ఆడియన్స్ చేత విజిల్స్ కొట్టించే సీన్స్ చాలానే ఉన్నాయి.

కాలికి గజ్జె కట్టుకుని తిరునాళ్లు, ఇతర ఉత్సవాల సందర్భంగా దేవుడి గుళ్ల ముందు డ్యాన్సులు చేసుకునే జాతి కథ పలాస 1978. ఆత్మాభిమానం మెండుగా ఉండే ఈ జాతి నుంచి అణచివేతకు ఎదురు తిరిగిన ఇద్దరు అన్నదమ్ముల కథ ఇది. తమ ధైర్యంతో ఆ ఊరి షావుకారుకు నమ్మిన బంటుల్లా మారి.. వాడి కోసం హత్యలు చేస్తూ రౌడీలుగా చెలామణి అయ్యే వీరి జీవితంలోకి వచ్చిన ఓ పోలీస్ వల్ల జీవితమే మారిపోతుంది. ఆ కథ వెండితెరపైనే చూడాలి. అంబేడ్కరిజం అంటూ గంటల కొద్దీ చెప్పే మీటింగ్ ను మూడు ముక్కుల్లో చెప్పేసిన ప్రీ క్లైమాక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఊరి మధ్య విగ్రహం చూపిన ఆశయాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు దర్శకుడు.

ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వయసు పరంగా మూడు దశల్లో సాగే ఈ కథలో ప్రతి నటుడు కథలో మిళితమై పోయారు. ఆ పాత్రల్లా ప్రవర్తించారు. ఆ క్రెడిట్ ఖచ్చితంగా దర్శకుడిదే. హీరోగా నటించిన రక్షిత్ ఈ కాలంలో మరో గొప్ప నటుడుగా మిగిలిపోయే సత్తా ఉన్నవాడుగా కనిపిస్తాడు. అలాగే జార్జిరెడ్డి ఫేమ్ తిరువీర్ పాత్ర, నటనా.. అనన్యసామాన్యం. గొప్ప నటులు సినిమావాళ్ల కుటుంబాల్లో కాదు.. బయటే ఉన్నారనేందుకు ఈ తిరువీర్, రక్షిత్ తో పాటు ఇందులోని చాలామంది నటులు ఓ ఉదాహరణ.

విలన్ గా నటించిన పాత్రధారి.. గ్రామీణ అగ్రకుల నాయకుడుగా అచ్చంగా సరిపోయారు. రఘు కుంచె నటుడుగా ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాడు. ప్రొఫెషనల్ యాక్టర్ గా అదరగొట్టాడు. అయితే రఘు కుంచెలో ఎంత గొప్ప సంగీత దర్శకుడు ఉన్నాడో ఈ సినిమా తర్వాత మరోసారి ‘సినిమావాళ్లకు’ తెలుస్తుంది. ఆర్ఆర్ చూస్తే ఇప్పటి వరకూ మనం తోపులు అనుకున్నవాళ్లు కూడా తీసిపోయేంత గొప్పగా ఉంటుంది. భారీ బడ్జెట్ మాస్ హీరో సినిమాకు ఏ మాత్రం తగ్గని ఆర్ఆర్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. ఇక ప్రతి పాటా ఇప్పటికే హిట్టయ్యిపోయాయి కదా.. విన్సెంట్ సినిమాటోగ్రఫీ ఓ అద్భుతం. కథ మూడ్ ను ఏ మాత్రం తగ్గించుకుండా పరిమిత లైటింగ్ తోనే వావ్ అనిపిస్తాడు.

దర్శకుడు కరుణకుమార్ తెలుగు సినిమా స్థాయిని పెంచే సత్తా ఉన్నవాడని చూసిన ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీరతారు. ఒక పా. రంజిత్, వెట్రిమారన్ కలబోతగా భారతీరాజా స్థాయి స్థాయి ఉన్న దర్శకుడు అనిపిస్తాడు.

పలాస 1978 జాతులకు అతీతంగా ప్రతి ఒక్కడూ చూడాల్సిన సినిమా. మనిషితనం ఉన్న ప్రతి మనిషినీ కదిలించే సినిమా. మొత్తంగా ఇది సమాజాన్ని చదివిన, సామాజిక బాధ్యత ఉన్న ఓ దమ్మున్నవాడు.. తీసిన సినిమా.

- బాబురావు. కామళ్ల.

Tags

Read MoreRead Less
Next Story