అమరావతిలో మూడు నెలలుగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వ స్పందన కరువు
అమరావతి ఉద్యమం 88వ రోజుకు చేరింది.. రాజధాని తరలించొద్దన్న నినాదంతో 88 రోజులుగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు 29 గ్రామాల ప్రజలు. ప్రభుత్వం దిగి రావాలని, సీఎం జగన్ మనసు మారాలంటూ దేవుళ్లకు మొక్కుతున్నారు.. మందడం, వెలగపూడి, తుళ్లూరు, కృష్ణాయపాలెం, పెనుమాకలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.. దాదాపు మూడు నెలలుగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంపై రైతులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మహాధర్నాలు, రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు..
దీక్షా శిబిరాలు అమరావతి నినాదాలతో హోరెత్తుతున్నాయి.. ఎన్నిరోజులైనా ఉద్యమం ఆగదని, ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేయబోమని రైతులు, మహిళలు అంటున్నారు. రాజధానిని తరలించడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రను న్యాయస్థానాలు అడ్డుకుంటాయన్న నమ్మకం ఉందని వారంటున్నారు. ఇక వెలగపూడిలో రైతులు 24 గంటల దీక్షలు చేపడుతున్నారు. తమ పోరాటంలో న్యాయం ఉందని, అంతిమ విజయం తమదేనని చెబుతున్నారు. అటు రైతుల దీక్షలకు విపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతిస్తున్నాయి. నిరసనలను అడ్డుకునేందుకు రాజధాని గ్రామాల ప్రజలను కేసులతో ప్రభుత్వం భయపెడుతోందని విపక్ష నేతలు మండిపడ్డారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com