ఇవాళ అసెంబ్లీలో కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న జగన్‌

ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ఇవాళ... అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు సీఎం జగన్‌ మోహన్ రెడ్డి. విభజన సమయంలో కేంద్రంలోని అధికార , విపక్షాలు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని సభలో తీర్మానం చేస్తారు. హోదా ఇవ్వడంతో రాష్ట్రానికి వచ్చే ప్రత్యేక నిధులు, పారిశ్రామిక రాయితీలు, యువతకు ఉపాధి అవకాశాలు , నీతి ఆయోగ్ చెప్పిన అంశాలను సభలో ప్రస్తావించనున్నారు జగన్‌.

అటు శాసనమండలిలో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రత్యేక హోదాపై తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. అక్కడ కూడా చర్చ అనంతరం తీర్మానాన్ని ఆమోదిస్తారు. హోదాపై కేంద్రం సానుకూలంగా స్పందించేంత వరకూ ప్రతి అసెంబ్లీ సమావేశాల్లోనూ.. పార్లమెంటు సమావేశాల్లోనూ ప్రస్తావిస్తూ ప్రధానికి గుర్తు చేయాలని జగన్ నిర్ణయించారు..

శాసనసభలో ప్రత్యేక హోదాపై తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందు శాసభసభలో ఉదయం 11గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నికను ప్రకటిస్తారు. శాసనసభ ఉప సభాపతి పదవికి వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ స్పీకర్‌గా ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో .. రఘుపతి ఎన్నిక లాంచనం కానుంది... దీంతో డిప్యూటీ స్పీకర్‌గా ఆయనను .. శాసనభాపతి తమ్మినేని సీతారాం సభలో అధికారికంగా ప్రకటించనున్నారు.

డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నిర్వహించిన చర్చకు సీఎం జగన్ సమాధానం చెప్తారు. తరువాత దానిని ఆమోదిస్తారు. అనంతరం ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ జగన్‌ సభలో తీర్మానం ప్రవేశపెడతారు..

Tags

Read MoreRead Less
Next Story