రాబోయే రోజుల్లో ఏపీలో మిగిలేవి బీజేపీ వైసీపీలే: చౌహాన్

రాబోయే రోజుల్లో ఏపీలో మిగిలేవి బీజేపీ వైసీపీలే: చౌహాన్

వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కసరత్తు చేస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపిన ఆపార్టీ టీడీపీ నేతలకు గాలం వేస్తోంది. పలువురు నేతలను ఇప్పటికే పార్టీలోకి ఆహ్వానించగా.. రానున్న రోజుల్లో వైసీపీకి ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి మోదీ పాలనలోని లబ్ధి చేకూరిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బలోపేతంపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రలో ఘోర పరాజయం పాలైన కమలం పార్టీ.. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటాలనుకుంటోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలను చేర్చుకున్న బీజేపీ.. మరికొందరికి స్వాగతం పలికే పనిలో ఉంది. మరోవైపు సభ్యత్వ నమోదుతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలను పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.ఏపీలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ హాజరయ్యారు.కోట్ల సంఖ్యలో ఉన్న కార్యకర్తలే బీజేపీకి అసలైన బలమని ఆయన అన్నారు.. ఏపీలో కాంగ్రెస్, టీడీపీ అడ్రెస్‌ గల్లంతు ఖాయమని విమర్శలు గుప్పించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మిగిలేవి బీజేపీ,వైసీపీలేనని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు.

అధికారం కోసం పనిచేసే పార్టీ బీజేపీ కాదన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌. ధన, కుల, వర్గ రాజకీయాలకు బీజేపీ దూరమన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శివరాజ్‌సింగ్ చౌహాన్ సమక్షంలో పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ... ఆ దిశగా వేగం మరింత పెంచుతోంది. మరి ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి ..

Tags

Read MoreRead Less
Next Story