సెట్‌లో నా అంత అందంగా.. నా అంత నాజూగ్గా మరెవరూ.. : వాణీశ్రీ

సెట్‌లో నా అంత అందంగా.. నా అంత నాజూగ్గా మరెవరూ.. : వాణీశ్రీ

చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది.. దాని తస్సదియ్యా అందమంతా చీరలోనే ఉన్నది అని దసరాబుల్లోడు వయ్యారాలు ఒలకబోస్తున్న వాణీశ్రీని టీజ్ చేస్తుంటాడు నాగేశ్వర్రావు. ప్రేక్షకులు ఎంత హాయిగా ఆ సినిమా ఎంజాయ్ చేశారో. నవలానాయకి వాణిశ్రీ కట్టుకునే చీర, పెట్టుకునే బొట్టు వరకూ అన్నీ ట్రెండ్ సెట్టరే. ఆరోజుల్లో ఆడపిల్లలంతా వాణీశ్రీని ఫాలో అయ్యేవారంటే అతిశయోక్తి కాదు. చలన చిత్రసీమలో తనకంటూ ఓ పేజీ కాదు ఓ అధ్యాయాన్నే లిఖించుకున్న వాణీశ్రీ ఇప్పుడు బుల్లితెరపై కూడా సందడి చేయబోతోంది ప్రేమనగర్ సీరియల్ ద్వారా. 70 సంవత్సరాల వయసులోనూ అదే చిలిపిదనం.. అదే గాంభీర్యం.. ఆమెకే సాధ్యం. సినిమాకు సంబంధించిన అన్ని విషయాలపై అవగాహన ఉన్నా నటనపైన మాత్రమే దృష్టి పెట్టారు వాణిశ్రీ.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కథక్, మణిపురి, భరత నాట్యం, కూచిపుడి నాట్యాల్లో ప్రవేశం ఉన్నా అటువైపు వెళ్లలేదు. చిన్నప్పటి నుంచి కథలు రాయడం అలవాటు. అయినా ఎప్పుడు కథ రాసి సినిమాలు తీద్దామని అనుకోలేదు. ఓసందర్భంలో నాగేశ్వరరావు గారితో మీరు బాగా మాట్లాడతారు కదా.. సినిమాలకు మాటలు రాయొచ్చు కదా అంటే.. ఇంతకంటే బాగా రాసే వాళ్లు ఉన్నప్పుడు మనం ఎందుకు రాయడం అన్నారు. అన్నిట్లో మనపేరే ఉండాలని ఎందుకనుకోవాలని అన్నారు. ఆ మాటలు నాలో బలంగా నాటుకు పోయాయి. అందుకే నటిగానే కొనసాగాను. అందంగా అలంకరించుకోవడం.. కెమెరా ముందుకు రావడం.. సెట్‌లో నాకంటే మరెవరూ అందంగా ఉండకూడదు అనుకునేదాన్ని. తెల్లగా ఉండే వాళ్లు చాలా మంది నటి కావాలని వచ్చినా వాళ్లందరూ వాణీశ్రీ ముందు.. వాణీశ్రీ నటన ముందు దిగదుడుపే. భగవంతుడు నన్ను నటిగానే కొనసాగమన్నాడు. అందుకే నటిగా మంచి పాత్రలు చేశాను. ఆరోజుల్లో మాకు సినిమా అంటే ఒక తపస్సు. సెట్‌లో ఏకాగ్రతతో ఉండేవాళ్లం. షూటింగ్ వాతావరణం అంతా నిశ్శబ్ధంగా ఉండేది.

దర్శకుడు యాక్షన్ అని చెప్పేంతవరకు సంభాషణలన్నీ గుర్తు పెట్టుకుని ఎలా చెప్పాలో మననం చేసుకుని హావ భావాలకి తగ్గట్టు చెప్పేవాళ్లం. కానీ ఇప్పుడంతా మారిపోయింది. సావిత్రి గురించి మాట్లాడుతూ.. ఆమె చందమామ.. మేమంతా తారలం. సినిమా కోసమే దేవుడు సావిత్రిని సృష్టించాడు. మీ బయోపిక్ ఎవరైనా తీస్తానంటే.. అదేలా కుదురుతుంది. నా జీవితంలో ట్విస్ట్‌లు, ట్రాజెడీలు ఏవీ లేవు. అలాంటివి ఏవీ లేనప్పుడు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోదు. అందుకే నా బయోపిక్ తీయడం సాధ్యం కాదు.

Tags

Read MoreRead Less
Next Story