వర్ష బీభత్సం.. నీటమునిగిన పార్కు.. జంతువుల మృత్యువాత

వర్ష బీభత్సం.. నీటమునిగిన పార్కు.. జంతువుల మృత్యువాత

ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.. వరదలతో పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది.. వరదలకు అసోంలో 11 మంది, అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆరుగురు మృతిచెందారు.. వేలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.

ఈశాన్యరాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదలతో పలు రాష్ట్రాల్లో జనజీవనానికి ఆటంకం ఏర్పడుతోంది. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడటంతో అసోం, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, మిజోరం రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. మూడు రోజుల్లో అసోంలో 11మంది మృత్యువాత పడగా.. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆరుగురు, బీహార్‌లో నలుగురు, బెంగాల్‌లో ఒకరు చనిపోయారు.

కుండపోత వర్షాలతో అసోంలోని 28 జిల్లాల్లో 26 లక్షల మందిపైగా ఇబ్బందులు పడుతున్నారు.. వేలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. అటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. రెస్క్యూ టీమ్‌లు నిరంతరం సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.. అటు కజిరంగా జాతీయ పార్కు నీటమునగడంతో పార్కులోని ఖడ్గమృగాలు, ఇతర జంతువులను ఎత్తైన ప్రాంతాలకు తరలించారు. వరదలు పార్కును ముచ్చేత్తడంతో జంతువులు మృతి చెందాయి.

అరుణాచల్‌ప్రదేశ్‌నూ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.. మిజోరంలో ట్లబుంగ్ పట్టణాన్ని వరదలు చుట్టముట్టడంతో వందలాది ఇళ్లు మునిగిపోయాయి. కోసి నది ఉప్పొంగుతూ ప్రవహిస్తోంది.. దీంతో అసోం, బీహార్ సరిహద్దుల్లో వరదలో చిక్కుకుపోయిన 700 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు మధ్యప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.. జనజీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి.

మరోవైపు నేపాల్‌, బంగ్లాదేశ్‌లోనూ వర్ష బీభత్సం కొనసాగుతోంది.. నేపాల్‌లో 60 మంది చనిపోగా.. బంగ్లాదేశ్‌లో 10 మంది మృతిచెందారు.. గురువారం నుంచి నేపాల్‌లో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్లపైకి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలమట్టం కాడంతో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.. కొండచరియలు విరిగి పడిన ఘటనలో 38 మందికి గాయాలయ్యాయి. అదృశ్యమైన మరో 35 మంది ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్‌లు గాలిస్తున్నాయి.. నేపాల్‌లోని 30 జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 10వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.. ఒక్క కఠ్మాండులోనే 185 మందిని నేపాల్ సైన్యం, పోలీసులు రక్షించారు. వరద సహాయ చర్యల కోసం నేపాల్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 27,380 మంది పోలీసులను మోహరించింది.

Tags

Read MoreRead Less
Next Story