అంతా క్షణాల్లోనే.. 14 మంది ప్రాణాలు తీసిన టెంట్‌

అంతా క్షణాల్లోనే..   14 మంది  ప్రాణాలు తీసిన టెంట్‌

అంతా క్షణాల్లో జరిగిపోయింది. దైవ భక్తిలో పారవశ్యమైన వారికి అవే చివరి క్షణాలయ్యాయి. టెంట్‌ రూపంలో మృత్యువు వారిని బలి తీసుకుంది. ఒక్కసారిగా గాలీ వానా బీభత్సం సృష్టించడంతో టెంటు కూలి 14 మంది మృతి చెందగా.. 50 మందికిపైగా తీవ్ర గాయాల పాలయ్యారు. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..

రాజస్తాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బార్మెడ్ జిల్లాలో టెంట్‌ కూలి 14 మంది మృతిచెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం తరలివచ్చిన భక్తుల కోసం అక్కడ పెద్ద ఎత్తున గుడారాలు ఏర్పాటు చేశారు. అదే సమయంలో గాలి, భారీ వర్షం బీభత్సం సృష్టించడంతో అవి ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ ఘటనలో అక్కడిక్కడే పలువురు భక్తులు మృతి చెందారు.

గుడారాలు కూలిన సమయంలో విద్యుత్‌ షాక్‌ కొట్టడంతో మరికొంతమంది మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరగిన సమయంలో దాదాపు వెయ్యి మంది భక్తులు అక్కడ ఉన్నారు. గాయపడిన వారిని స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది..

బార్‌మీట్‌ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఘటన జరగటం దురదృష్టకరమన్నారు. మృతి చెందిన వారి కుటుంబాకు అండగా ఉంటామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రమాద ఘటనపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ విచారణకు ఆదేశించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయాల పాలైన వారికి 2 లక్షల ఎక్స్‌గ్రేషియోను రాజస్థాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story