ఇంజినీరింగ్ చదివి.. టీ కొట్టు పెట్టి.. కోట్లలో టర్నోవర్..

ఇంజినీరింగ్ చదివి.. టీ కొట్టు పెట్టి.. కోట్లలో టర్నోవర్..

ఏం సదువుకోలేదు బాబు.. చాయ్ పెట్టడం మాత్రం వచ్చు. అందుకే చిన్న చాయ్ బడ్డీ పెట్టుకుని బతికేస్తున్నాను అనే వారుంటారేమో కానీ.. ఇంజినీరింగ్ చదివి కార్పొరేట్ కంపెనీలో మంచి ప్యాకేజీతో ఉద్యోగం చేసే యువకులు చేస్తున్న ఉద్యోగం బోర్ కొట్టేసి టీ కొట్టు పెట్టుకుంటే.. కోట్లలో ఆర్జిస్తుంటే.. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే అరగంటలో వచ్చేస్తుంది. అదే టీ కూడా నిమిషాల్లో వేడి వేడిగా మన ముందుంటే.. ఆహా! ఆలోచన ఎంత బావుందో.. ఇంకేం ఆచరణలో పెట్టేద్దాం అనుకున్నారు. ఓ ఇద్దరు ఇంజనీరింగ్ కుర్రాళ్లకు వచ్చిన బ్రహ్మాండమైన ఐడియా ఇది.

బరేలీకి చెందిన అభినవ్, ప్రమిత్‌లు లక్నోలో ఇంజినీరింగ్ చదివారు. ఇద్దరూ క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగం సంపాదించుకున్నారు. మంచి జీతం వస్తోంది. అయినా ఎందుకో హ్యాపీగా లేరు. రొటీన్‌కి భిన్నంగా ఏదైనా చేయాలనుకున్నారు. దీంతో 2014లో 'చాయ్ కాలింగ్' పేరుతో ఢిల్లీ శాటిలైట్ సిటీ నొయిడా సెక్టార్-16 మెట్రో స్టేషన్ వద్ద టీ-స్టాల్ ప్రారంభించారు. ఆఫీస్‌లో ఉన్నప్పుడు మిషన్ టీ తాగలేక బయటకు వెళ్లి ఇద్దరూ టీ తాగేవాళ్లు. అప్పుడే సెగలు కక్కే చాయ్ సిప్ చేస్తుంటే ఓ ఐడియా వచ్చింది. వారి ఆలోచన ఆచరణ రూపం దాల్చి చాయ్ కాలింగ్ ఏర్పాటైంది. లక్ష రూపాయల పెట్టుబడితో చాయ్ కాలింగ్ ఏర్పాటు చేశారు.

ఇంటింటికీ టీ డెలివరీ చేయడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల్లోనే కస్టమర్ల సంఖ్య పెరిగింది. వ్యాపారం విస్తరించింది. ఈ పేరుతో వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేశారు ఇద్దరు ఇంజనీర్లు. బిజినెస్ పెరగడంతో వివిధ కార్పొరేట్ కంపెనీల నుంచి ఆర్డర్లు రావడం మొదలైంది. ఒక కప్పు టీ ధర రూ.10 నుంచి రూ.15లు ఉంటుంది. చక్కని, చిక్కని, రుచికరమైన టీ అందిస్తూ కస్టమర్లను పెంచుకుంటున్నారు అభినవ్, ప్రమిత్‌లు. ప్రధాన నగరాల్లో చాయ్ కాలింగ్ పేరుతో 15 టీ స్టాళ్లను నడుపుతున్నారు. కస్టమర్లనుంచి ప్రశంశలతో పాటు మరి కొన్ని బిజినెస్ ఆర్డర్లను కూడా అందుకుంటున్నారు.

నొయిడాలో 3, బరేలీలో 6 స్టాళ్లను ఏర్పాటు చేశారు. దీంతో వారి బిజినెస్ టర్నోవర్ కూడా పెరిగింది. 2015లో 50 లక్షల టర్నోవర్ వస్తే.. 2019లో అది రూ.2 కోట్లకు చేరింది. 100 మంది యువతకు ఉద్యోగాలిచ్చి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. సంకల్పం గట్టిదైతే సాధ్యం కానిది ఏదీ లేదని చాటి చెబుతున్నారు ఈ ఇంజినీర్లు. ఉద్యోగం లేదని నిరాశ, నిస్పృహల్లో కూరుకుని పోకుండా సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకుని ఇష్టంగా కష్టపడితే రిజల్ట్ బావుంటుందని చెబుతున్నారు. యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story