ఖాకీల కాఠిన్యం వెనుక కన్నీళ్లు..

ఖాకీల కాఠిన్యం వెనుక కన్నీళ్లు..

రేయింబవళ్లు ఒకరిని కాపాడడం కోసమే వారి డ్యూటీ. ఈ క్రమంలో వారు తమ ప్రాణాలు కోల్పోతుంటారు ఒక్కోసారి. తమ మీద ఆధారపడ్డ తమ కుటుంబాన్ని అన్యాయం చేసి అర్థాంతరంగా వెళ్లి పోతుంటారు. విధి నిర్వహణలో భాగంగా అనునిత్యం ఎన్నో ఒత్తిళ్లు, మరెంతో మంది నేరస్తులతో సంభాషణ.. వెరసి వారి గుండెలు కూడా బండరాయిలుగా మార్చేసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఖాకీ దుస్తుల వెనుక కరుణ హృదయం ఉంటుంది. ఉబికి వస్తున్న కన్నీటిని అదిమిపెడుతూ డ్యూటీ చేస్తుంటారని ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఓ ఫోటో చూస్తే అర్ధమవుతుంది. ఓ ఉన్నతాధికారి.. మరణించిన సహోద్యోగి కుమారుడిని ఎత్తుకుని కన్నీటి పర్యంతం అవుతున్న ఫోటో ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది.

గత వారం అనంతనాగ్‌లో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో శ్రీనగర్‌కి చెందిన అర్షద్ ఖాన్ అనే పోలీస్ అమరుడయ్యాడు. అతడి కుటుంబసభ్యుల సమక్షంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ముష్కరులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో అర్షద్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఢిల్లీ ఎయిమ్స్‌కి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. రెండు రోజుల క్రితం అర్షద్ మరణించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ హసీబ్ ముఘల్ హాజరయ్యారు. ఈ క్రమంలో హసీబ్, మరణించిన అర్షద్ ఖాన్ నాలుగేళ్ల కుమారుడు ఉబన్‌ను ఎత్తుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. అర్షద్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరితో పాటు తల్లిదండ్రులు, సోదరుడు కూడా అర్షద్ మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. అర్షద్ మరణంతో ఇంటి పెద్దదిక్కును కోల్పోయింది ఆ కుటుంబం.. మేమెలా బ్రతకాలి అంటూ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆక్రందనలు అక్కడి వారి హృదయాలను కలిచి వేశాయి.

Tags

Read MoreRead Less
Next Story