సేవ ముసుగులో ఘరానామోసం

సేవ ముసుగులో ఘరానామోసం

మంచి వాళ్లను నమ్మకపోతే మోసపోతారు. చెడ్డవాళ్లను నమ్మి నష్టపోతారు. ఇది ఓ స్వచ్ఛంద సంస్థ క్యాప్షన్. తాము నిస్వార్థంగా పేదల కోసం పనిచేసేందుకు వచ్చామంటూ రంగంలోకి దిగిన ఆ సంస్థ పేదల్ని తేలిగ్గానే బుట్టలో వేసుకుంది. వాళ్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి జెండా పీకేసింది. దీంతో.. బాధితులు తమకు న్యాయం చేయాలంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. ప్రకాశం జిల్లా ఎస్పీని కలిసి జరిగిదంతా చెప్పుకుని భోరుమన్నారు. హైదరాబాద్‌లోని నల్లకుంట ప్రాంతానికి చెందిన నరసింహం అనే వ్యక్తి 'మదర్‌ బేబీ ఫౌండేషన్‌' పేరిట రెండున్నరేళ్ల క్రితం పలు జిల్లాల్లో బ్రాంచిలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఒంగోలులో కూడా కార్యాలయాన్ని తెరిచారు. ఏజెంట్లను నియమించుకునే విషయంలో ఓ రాజకీయ పార్టీకి చెందిన మహిళా నాయకురాలి సహాయం కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి రైతులు, నేతన్నలు, మత్స్యకారులు, ఇతర వివిధ వృత్తుల వారికి రుణాలు ఇప్పిస్తామంటూ విస్తృత ప్రచారం చేసి ఆపై వసూళ్లు ప్రారంభించారు. వీరి మాటలు నమ్మిన అమాయకులు లక్ష రూపాయల రుణానికి 16 వేలు కమీషన్‌గా ముందే ఇచ్చేశారు. కొందరి వద్ద 18వేలు, 20వేల వరకూ కూడా దండుకున్నారు. పేదలు ఇళ్ళు నిర్మించుకునేందుకు కూడా రుణాలు ఇప్పిస్తామంటూ వసూళ్ల పర్వం సాగించారు. తాము డబ్బులు కట్టి నెలలు గడుస్తున్నా ఇంతవరకూ లోన్ విషయంలో అతీగతీ లేకపోవడంతో బాధితులు ఆందోళన చెందారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

ఎస్పీ ఆదేశాలతో కేసు విచారణ చేస్తున్న పోలీసులు.. మదర్‌బేబీ సంస్థ ఇతర జిల్లాల్లోనూ చాలా మందిని ముంచినట్టు గుర్తించారు. ప్రకాశం జిల్లాలో కందుకూరు, సింగరాయకొండ, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో బాధితులు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. అలాగే కృష్ణా జిల్లాలోని నూజివీడు, మచిలీపట్నంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ ఈ దందా కొసాగింది. తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి బాధితులు వచ్చి ఒంగోలు పోలీసులను కలిసి తమకు జరిగిన మోసాన్ని వివరిస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాలతోపాటు, హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఈ సంస్థ 40 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టినట్లు తెలుస్తోంది. వందల మందిని మోసం చేసిన ఈ ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ డబ్బులు తమకు తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.

Also Watch :

Tags

Read MoreRead Less
Next Story