మెగాస్టార్‌కి కష్టకాలంలో మెగా హిట్ ఇచ్చిన దర్శకుడు..

మెగాస్టార్‌కి కష్టకాలంలో మెగా హిట్ ఇచ్చిన దర్శకుడు..

ముత్యాల సుబ్బయ్య.. అభ్యుదయాత్మకమైన కథలకు కమర్షియల్ టచ్ ఇచ్చి ఖచ్చితమైన హిట్స్ కొట్టిన అతికొద్దిమంది దర్శకుల్లో ఒకరు. దర్శకుడుగా ఆయన ప్రయాణం చిత్ర విచిత్రంగా సాగినా.. ఒక్కసారిగా తన ముద్ర మొదలయ్యాక.. ఎన్నో అద్భుతమైన విజయాలను అందించారు. మెగాస్టార్ కష్టకాలంలో మెగా హిట్ ఇచ్చారు. మిడిల్ క్లాస్ హీరోలతో టాప్ హిట్సూ అందుకున్నా.. ఆయన బలం కథలే. అవి కూడా సామాజిక సమస్యలను ఎత్తి చూపినవే.. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయం రాసుకున్న సెంటిమెంట్ సినిమాల దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. ఆయన పేరు వినగానే సెంటిమెంట్ చిత్రాలే ఎక్కువగా గుర్తొస్తాయి. వెండితెరపై కన్నీటి వరదలు పారించినా.. కథల్లోని నవ్యత చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మరెవరూ ఊహించలేని కథలతో ఆకట్టుకున్న దర్శకుడాయన. పిసి రెడ్డి, టి కృష్ణల వద్ద అసిస్టెంట్ గా చేయడం వల్లేమో.. ఈ రెండు పంథాలు మిక్స్ అయిన సినిమాలు తీశారు. ప్రతి సినిమాలోనూ ఏదోక సందేశం ఇచ్చిన అరుదైన దర్శకుడు ముత్యాల సుబ్బయ్య.

ముత్యాల సుబ్బయ్య పుట్టింది ప్రకాశం జిల్లా బిట్రగుంటలో. పెరిగింది నెల్లూరు జిల్లాలో. అక్కడే చదువుతూ నాటకాల వైపు ఆకర్షితులయ్యారు. నాటక దర్శకుడుగా వచ్చిన గుర్తింపుతో పాటు, స్నేహితుల ప్రోద్బలంతో మద్రాస్ కు వెళ్లారు. అక్కడ ఉన్న పరిచయాలతో ముందుగా అక్కినేని సంజీవి వద్ద అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు. ఒక సినిమా తర్వాత పిసి రెడ్డి వద్దకు వెళ్లారు. ఆయన వద్ద దాదాపు ఎనిమిదేళ్ల పాటు పనిచేసి చాలా తక్కువ టైమ్ లో కో డైరెక్టర్ గా ఎదిగారు. ఈ టైమ్ లో ఓ ప్రొడక్షన్ మేనేజర్ ఇచ్చిన అవకాశంతో దర్శకుడుగా మారారు ముత్యాల సుబ్బయ్య. తొలి సినిమాతోనే పరిశ్రమను ఉలిక్కి పడేలా చేశారు ముత్యాల సుబ్బయ్య. ఆ సినిమా మూడుముళ్ల బంధం. ఇరవైయేళ్ల యువతికి ఎనిమిదేళ్ల బాలుడు తాళికడతాడు. అందుకు దారితీసిన పరిస్థితులేంటీ.. ఆ తర్వాత ఆ యువతి జీవితం ఏమైంది అనేది కథ. ఇలాంటి కథకు ఆ రోజుల్లో సెన్సార్ తో పాటు పరిశ్రమ సైతం ఆశ్చర్యపోయింది. వీళ్ల ఊహలకు భిన్నంగా సినిమా ఫ్లాప్ అయింది. తొలి సినిమా ఫ్లాప్ కావడంతో దర్శకుడుగా ఎవరూ అవకాశాలివ్వలేదు. దీంతో జీవితం నడవడం కోసం మళ్లీ కో డైరెక్టర్ గా మారాడు. దర్శకుడు టి కృష్ణ వద్ద చేరాడు. ఆయన వద్ద దాదాపు ఆరేళ్లకు పైగా కో డైరెక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలో దర్శకుడుగా మరో అవకాశం వచ్చింది. వెన్నెల మెట్లు అనే నవల ఆధారంగా వచ్చిన ఆ సినిమా అరుణ కిరణం. అప్పటికే టి కృష్ణ సినిమాలతో ఫేమ్ అయిన రాజశేఖర్, విజయశాంతి జంటగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్. దీంతో ఇక వెనుదిరిగి చూసే అవసరం రాలేదాయనకు. అభ్యుదయ ఛాయలున్న అరుణకిరణం తర్వాత దాదాపు ఆ తరహా చిత్రాలే వరుసగా చేయడం మొదలుపెట్టారు. అవేవీ బిగ్ హిట్స్ కాలేదు కానీ.. యావరేజ్ గా నిలిచాయి. కెరీర్ మళ్లీ గాడితప్పుతోంది అనుకుంటోన్న టైమ్ లో బాలకృష్ణతో చేసిన ఇన్స్ పెక్టర్ ప్రతాప్ సూపర్ హిట్ అయింది. ఆ వెంటనే చిన్నారి స్నేహం, మమతల కోవెల, భారతనారి, నేటి చరిత్ర ఇలా వరుస విజయాలు వచ్చాయి. అఫ్ కోర్స్ మధ్యలో కొన్ని యావరేజ్ సినిమాలూ ఉన్నాయ్.

ముత్యాల సుబ్బయ్య కెరీర్ తొలినాళ్ల నుంచి సినిమాకు సామాజిక ప్రయోజనం ఉండాలని నమ్మినట్టుగా ఈ సినిమాలు చూస్తేనే తెలుస్తుంది. వీటిలో ప్రతి సినిమాలోనూ ఓ సందేశం ఉంటుంది. అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ కు కొదవ ఉండదు. నాటి ట్రెండ్ ను ఫాలో అవుతూనే.. తన ఫీల్ నూ కథనంలో జోడించారు. కాబట్టే ఆయన సినిమాలు అప్పటి ట్రెండ్ లో కాస్త భిన్నంగా కనిపించాయి. ముత్యాల సుబ్బయ్య సినిమాల శైలి చూసిన చాలామంది ఆయన దాసరి నారాయణ శిష్యుడు అనుకుంటారు. కానీ కాదు. అయితే దాసరి ప్రధాన పాత్రలో ఓ ఎవర్ గ్రీన్ హిట్ కొట్టారు. అదే మామగారు. వినోద్ కుమార్, దాసరి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమాలోనూ నిజాయితీని గురించే చర్చించాడు. ఈ సినిమాతో తనలోని కామెడీ యాంగిల్ ను సైతం పరిశ్రమకు పరిచయం చేశాడు. మామగారుతో కోట శ్రీనివాసరావు, బాబూమోహన్ జంట టాలీవుడ్ లో స్థిరపడిపోయింది.ఇక పూర్తిగా సెంటిమెంట్ ను జోడించి తీసిన కలికాలం సినిమా నేటికీ ఎన్నో కుటుంబాల్లోని పరిస్థితులకు అద్దం పడుతుంది. జయసుధ నిర్మించి నటించిన ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించింది. ఇందులోని ప్రతి పాత్రా నాటి ప్రేక్షకులకు నేటికీ గుర్తుండిపోతుందంటే అతిశయోక్తి కాదు. తన తొలి సినిమా మూడుముళ్ల బంధంలో ఓ చిన్న పాత్రలో కనిపించిన రాజేంద్ర ప్రసాద్ జీవితమంతా చెప్పుకునే సినిమా కూడా అందించారు ముత్యాల సుబ్బయ్య. అప్పటికే కామెడీ హీరోగా ఎదిగిన రాజేంద్ర ప్రసాద్ తో కంప్లీట్ గా ఓ సీరియస్ సబ్జెక్ట్ చేశాడు. ఎర్రమందారంగా వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. రాజేంద్ర ప్రసాద్ లో ఇంత గొప్ప నటుడున్నాడా అని పరిశ్రమ మొత్తం ఆశ్చర్యపోయింది. అతనికి ఉత్తమ నటుడుగా నంది అవార్డ్ వచ్చింది. అలాగే బెస్ట్ మూవీ, బెస్ట్ విలన్ విభాగంలోనూ ఎర్రమందారం జెండా ఎగరేసింది.

1986 నుంచి దర్శకుడుగా సిసలైన కెరీర్ మొదలుపెట్టిన ముత్యాల సుబ్బయ్య.. ఎందుకో అప్పటి స్టార్ హీరోలతో ఎక్కువ సినిమాలు చేయలేదు. ఇక ఎర్రమందారం తర్వాత వరుసగా అరడజను సినిమాల వరకూ వెరీ యారవేజ్ అనిపించుకున్నాయి. ఆ టైమ్ లో మరోసారి తన సెంటిమెంట్ అస్త్రంతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. కృష్ణంరాజు, రాధిక అన్న చెల్లెళ్లుగా వచ్చిన పల్నాటి పౌరుషంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఈ సినిమా సెంటిమెంట్ పరంగా ఇప్పుడు చూసినా హృదయం బరువెక్కుతుంది. 1990ల తర్వాత పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. కొత్త స్టార్స్ పుట్టుకొచ్చారు. కాన్ స్టంట్ గా హిట్స్ కొడుతున్నారు. కానీ ముత్యాల సుబ్బయ్య కేవలం కథలను నమ్మి వాటికి తగ్గ ఆర్టిస్టులనే తీసుకునేవారు. దీంతో ఆయన అప్పటికి స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి పెద్దగా చేరలేదనే చెప్పాలి. 90ల్లోనే స్టార్ హీరో హోదాకు చేరుకున్న రాజశేఖర్ తో చేసిన అన్న సినిమా మరో సూపర్ హిట్ గా నిలిచింది. తన కెరీర్ లో ఎక్కువ సినిమాలు రాజశేఖర్ తోనే చేశారు. వీరి కాంబినేషన్ లో మొత్తం 9 సినిమాలు రావడం విశేషం.

తర్వాత అలీ, మహేశ్వరి ప్రధాన పాత్రల్లో చేసిన అమ్మాయి కాపురం ఆకట్టుకుంది. విశేషం ఏంటంటే.. అప్పట్లో తన పంథాలో టాప్ హీరోగా వెలుగుతోన్న విప్లవ చిత్రాల కథానాయకుడు ఆర్ నారాయణ మూర్తితో ఓ సినిమా చేశారు. ఎర్రోడు పేరుతో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్. దీంతో మరోసారి తన అస్త్రం తీశారు. మోహన్ బాబు, రమ్యకృష్ణ జంటగా సోగ్గాడి పెళ్లాంతో సూపర్ హిట్ అందుకున్నారు. పేకాట వ్యసనం ఉన్న రాంబాబు పాత్రలో మోహన్ బాబు రమ్యకృష్ణ పోటీ పడి నటించిన ఈ సినిమా కూడా తెరపై కన్నీటి వరద పారిస్తుంది. ముత్యాల సుబ్బయ్య టాప్ లీగ్ లోకి ఎంటర్ అయింది1997లో అని చెప్పొచ్చు. అప్పటికి ఎవరూ సాహసించని సబ్జెక్ట్ తో విక్టరీ వెంకటేష్, సౌందర్య జంటగా సినిమా చేశారు. కాంట్రాక్ట్ మ్యారేజ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా పవిత్ర బంధం. ఈ మూవీ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. కాంట్రాక్ట్ మేరేజ్ కథకు అంత పెద్ద స్టార్స్ ఒకే చెప్పడం కూడా ఆయనకు ప్లస్ అయింది. అలాగే ఇదే జంటతో చేసిన మరో డేరింగ్ సబ్జెక్ట్ పెళ్లి చేసుకుందాం.. రేప్ విక్టిమ్ కు అండగా నిలిచిన హీరో చివరికి ఆమెనే పెళ్లాడ్డం.. ఆ రోజుకు ఇదీ ఓ సాహసమే. 1990ల మధ్యలో మెగాస్టార్ చిరంజీవి వరుస డిజాస్టర్స్ చూశారు. ఆయన కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఏకంగా ఏడు నెలల వరకూ గ్యాప్ తీసుకున్నారు. దీంతో చిరంజీవి పని అయిపోయిందన్న వాళ్లూ ఉన్నారు. ఆ టైమ్ లో మెగాస్టార్ కు రీ ఎంట్రీ లాంటి సినిమాతో మెగా హిట్ ఇచ్చింది ముత్యాల సుబ్బయ్యే. ఏడు నెలల గ్యాప్ తర్వాత చిరంజీవి చేసిన హిట్లర్ సూపర్ హిట్ కావడంతో ఆయన మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. మెగాస్టార్ తన ఇమేజ్ కు భిన్నంగా కథకు సరెండర్ కావడం సినిమాకు మేజర్ ప్లస్ అయింది. ఆ తర్వాత చిరంజీవితో అన్నయ్య అనే సినిమా కూడా చేశారు. ముత్యాల సుబ్బయ్యకు చివరి హిట్ కూడా ఇదే అనుకోవచ్చు.

తనకు హిట్లర్ వంటి హిట్ ఇచ్చాడనే కారణంతోనో లేక ఆయన టేకింగ్ పై నమ్మకంతోనో పవన్ కళ్యాణ్ రెండో సినిమా గోకులంలో సీతబాధ్యత ఇచ్చారు. బిగ్గెస్ట్ హిట్ కాకపోయినా పవన్ తొలి పరాజయాన్ని మరిపించే హిట్ అయింది. బాలకృష్ణతో చేసిన పవిత్ర ప్రేమ అస్సలు ఆడలేదు. మళ్లీ రాజశేఖర్ తో చేసిన మనసున్న మారాజు హిట్. అయితే 2000లో వచ్చిన అన్నయ్య తర్వాత విజయాలు రాలేదు. తన గురువు టి.కృష్ణ తనయుడు గోపిచంద్‌ని హీరోగా పరిచయం చేస్తూ తీసిన తొలివలుపు మూవీ పూర్తిగా నిరాశపరిచింది. ఆయన చివరి సినిమా ఆలయం. మొత్తంగా హిట్లూ ఫ్లాపులు కలబోతగా ముత్యాల సుబ్బయ్య కెరీర్ కంటిన్యూ అయింది. మొత్తంగా తన తరం దర్శకుల్లో వైవిధ్యమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు ముత్యాల సుబ్బయ్య. ఎవర్ గ్రీన్ అన దగ్గ చిత్రాలెన్నో అందించారాయన. తన కాలానికి ఫార్వార్డ్ గా ఆలోచించిన కథలన్నీ అద్భుత విజయాలు సాధించాయి. సినిమాకు ఓ సామాజిక ప్రయోజనం ఉండాలని భావిస్తూనే.. నిర్మాత శ్రేయస్సు కూడా ముఖ్యం అని భావించిన దర్శకుడు ముత్యాల సుబ్బయ్య.

-కె.బాబురావు

Tags

Read MoreRead Less
Next Story