జ‌గ్గారెడ్డి ఆ పోస్ట్ పై క‌న్నేయ‌డం వెనుక వ్యూహమేంటి..?

జ‌గ్గారెడ్డి ఆ పోస్ట్ పై క‌న్నేయ‌డం వెనుక వ్యూహమేంటి..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఫైర్ బ్రాండ్ తూర్పు జ‌య‌ప్రకాశ్ రెడ్డి.. అలియాస్ జ‌గ్గారెడ్డి. సంగారెడ్డి ప్రజ‌లు జ‌గ్గన్నా అని ముద్దుగా పిలుచుకునే జ‌గ్గారెడ్డి ఎంత‌టి గ‌డ్డు ప‌రిస్థితుల్లోనైనా తాను న‌మ్మిన సిద్దాంతంపైనే త‌న వాయిస్ పెంచుతుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగ‌సిప‌డుతున్నా .. టీ. కాంగ్రెస్ నేత‌లంతా జై తెలంగాణ అంటున్నా .. తాను మాత్రం స‌మైక్యాంద్రకే జైకొట్టారు. గ‌ట్టిగా స‌మైక్య వాయిస్ వినిపించారు. వైఎస్‌ కు నమ్మినబంటుగా మారారు. ఇక పార్టీ క‌ష్టకాలంలో ఉన్న స‌మ‌యంలో .. సంగారెడ్డిలో రాహుల్ గాంధీ స‌భ పెట్టి గ్రాండ్ స‌క్సెస్ చేసిన జ‌గ్గారెడ్డి .. తెలంగాణ కాంగ్రెస్ లో ఒక్కసారిగా పొలిటిక‌ల్ స్టార్ గా మారారు. కేసీఆర్ .. హ‌రీశ్ రావు ఇలాఖాలో కాంగ్రెస్ జెండా ఎగుర‌వేసి ఎమ్మెల్యేగా గెలిచిన జ‌గ్గారెడ్డి రాహుల్ గాంధీ దృష్టిని కూడా ఆక‌ర్శించారు.

తెలంగాణ ఉద్యమంలోనూ .. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత కూడా .. కేసీఆర్ పైనా .. ఆయ‌న కుటుంబం పైనా ఒంటికాలుపై లేచే జ‌గ్గారెడ్డి .. ఇప్పుడు ఉన్నట్లుండి స్వరం త‌గ్గించారు. హరీష్‌రావు మినహా కేసీఆర్, కేటీఆర్‌, కవిత సహా కల్వకుంట్ల కుటుంబసభ్యులపై విమ‌ర్శల‌ను ప‌క్కన పెట్టి.. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్దే ధ్యేయ‌మంటున్నారు. కొన్ని సంద‌ర్బాల్లో కేసీఆర్ ను ఆకాశానికెత్తుతూ మాట్లాడటంతో ఆయనప పార్టీ మారతారంటూ ప్రచారం జరిగింది. అయితే తాను పార్టీ మారే ప్రస‌క్తే లేద‌ని స్పష్టం చేశారు. అంతే కాదు... గ‌తంలో తాను టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి .. కాంగ్రెస్ లోకి వెళ్ళడం కూడా త‌ప్పేనంటూ కుండబ‌ద్దలు కొట్టిన ఆయ‌న .. ఇప్పుడు కేసీఆర్ కూడా ఫిరాయింపుల‌ను ప్రోత్సహించ‌డం సరికాదన్నారు తప్ప గట్టి విమర్శం లేకపోతున్నారు. గ‌తంలో త‌ప్పులు జ‌రిగాయ‌ని .. ఇప్పుడు కూడా త‌ప్పులు చేస్తామంటే ఎంత వ‌ర‌కు స‌బ‌బ‌ని మాత్రమే అంటున్నారు.

త‌న పాత పంథాను వీడి సుతిమెత్తని విమ‌ర్శల‌కే ప‌రిమిత‌మై .. లో ప్రొఫైల్ మేంటేన్ చేస్తున్న జ‌గ్గారెడ్డి .. త‌న‌కు పార్టీలో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే రాజ‌కీయంగా త‌న త‌డాఖా చూపిస్తానంటున్నారు. అయితే పార్టీలో ముఖ్యనేత‌లంతా పీసీసీ పై క‌న్నేసి లాబింగ్ లు చేసుకుంటుంటే .. జ‌గ్గారెడ్డి మాత్రం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అడుగుతుండ‌టం పార్టీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చకు దారితీస్తోంది. జ‌గ్గన్న ఉన్నట్లుండి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పై క‌న్నేయ‌డం వెనుక వ్యూహ‌మేంట‌నే చ‌ర్చ ఇప్పుడు టీ.కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story