అవన్నీ పుకార్లే.. తను పార్టీ మారే ప్రసక్తే లేదంటూ..

తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్‌ రెడ్డిపై చర్యలకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణా కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నాను అంటున్న రాజగోపాల్‌ రెడ్డి పార్టీ మారే ప్రసక్తే లేదంటున్నారు. కానీ ఆయన ఇప్పుడు ఢిల్లీకి వెళ్లడంతో.. ఏం జరుగుతోందని కేడర్‌ గందరగోళానికి గురవుతోంది.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ. ప్రధాని నరేంద్ర మోడీని పొగడటం అంటే… కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని అవమానించటమే అనే క్రమశిక్షణా కమిటీ అభిప్రాయపడింది. కాంగ్రెస్ పార్టీని, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని అవమాన పరిచేలా వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

మొదట ఎంపీపీ, జెడ్పీ ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరించారంటూ కొందరిపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించేందుకు సోమవారం భేటీ కావాలని పార్టీ క్రమశిక్షణా సంఘం గతంలోనే నిర్ణయించింది. ఈలోగా రాజగోపాల్‌ వ్యవహారం కూడా తెరపైకి రావడంతో ప్రధానంగా రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారంపైనే చర్చ జరిగింది. రాజగోపాల్‌ వ్యాఖ్యలను సమావేశంలో క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత చర్యలు తీసుకోవడమే మంచిదని కమిటీ అభిప్రాయపడింది.

ఈ పరిణామాలన్నీ జరుగుతుండగానే రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీలో ప్రత్యక్షం కావడంత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.. ఆయన పార్టీ మారడం ఖాయమనే ప్రచారానికి మరింత బలాన్ని కలిగించింది.. అయితే, తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగానే ఢిల్లీకి వచ్చినట్లు చెప్పుకొచ్చారు రాజగోపాల్‌రెడ్డి. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేసిన ఆయన.. షోకాజ్‌ నోటీసులపై నేరుగా స్పందించలేదు.

తనకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి ఉంటే.. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు రాజగోపాల్‌రెడ్డి. ఏపీలో జగన్‌లా పోరాటాలు చేసి ఉంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేదని అభిప్రాయపడ్డారు. తాను పార్టీ మారాలా లేదా అన్నది నియోజకవర్గ ప్రజలు, అనుచరులను సంప్రదించాకే ఏ నిర్ణయమైనా తీసుకుంటానన్నారు బయటకు పార్టీ మారడం లేదని చెబుతున్నా.. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే కాషాయ కండువా కప్పుకోవడం పక్కా అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి జంప్ కావడంతో పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ హోదా కోల్పోయింది. ఇప్పుడు రాజగోపాల్‌ రెడ్డి కూడా పార్టీ మారితే కాంగ్రెస్‌ మరింత ఇబ్బందులో పడనుంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *