వాతావరణ శాఖ హెచ్చరికలు..అక్కడ వాహనాలు ఆపొద్దని సూచన

వాతావరణ శాఖ హెచ్చరికలు..అక్కడ వాహనాలు ఆపొద్దని సూచన

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో పాటు భారీ వర్షం కురిసింది. భానుడి భగభగలతో ఇప్పటివరకు అల్లాడిన జనం… వర్షంతో ఉపశమనం పొందారు.

హైదరాబాద్‌లో వాతావరణం అకస్మాత్తుగా చల్లబడింది. సాయంత్రం 5గంటలకే ఆకాశాన్ని మబ్బులు కమ్మేయడంతో హైదరాబాద్‌ చీకటిమయంగా మారింది. శేరిలింగంపల్లి, చందానగర్‌, మియాపూర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, జీడిమెట్ల, ఈఎస్‌ఐ, ఎస్సార్‌నగర్‌, మైత్రివనం, మాదాపూర్‌, సోమాజిగూడ, బంజారాహిల్స్‌ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురవగా.. ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, కుషాయిగూడ, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్‌ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. సైనిక్‌పురిలో ఈదురుగాలులతో చెట్లు విరిగి నేలపై పడ్డాయి. రోడ్లపై వర్షపు నీరు ప్రవహించడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. క్యుములో నింబస్‌ మేఘాల ప్రభావంతో గంటపాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షంతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు కమిషనర్‌ దానకిశోర్‌. ఇప్పటికే అత్యవసర బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారాయన. రోడ్లపై పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల వద్ద వాహనాలు నిలపవద్దని ప్రజలకు సూచించారు. రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన పడింది.

మరోవైపు హైదరాబాద్‌తో పాటు కరీంనగర్‌, జగిత్యాల, మెదక్ జిల్లాల్లో వర్షం పడింది. యాదాద్రి-భువనగిరి జిల్లా మల్లాపురంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో గ్రామంలో చెట్లు నేలకూలాయి. కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కిన చంద్రయ్య గౌడ్‌, చెట్టు కూలి పోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

ఉత్తర కోస్తాలోను ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతం కావడంతో పట్టపగలే చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఇప్పటివరకు ఉక్కపోతతో అల్లాడిన జనానికి ఈ వాన కొంత ఉపశమనాన్ని కలిగించింది.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, తుని, ప్రత్తిపాడు, పెద్దాపురం, పిఠాపురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు జిల్లాలోని వేమూరు, పొన్నూరులో భారీ వర్షం కురవడంతో రోడ్లు జలమయం అయ్యాయి.

రుతుపవనాలు మరో రెండు రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశముందని, దానికి సూచికగానే వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story