ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ కూల్చివేతను వ్యతిరేకిస్తున్న వారసులు

ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ కూల్చివేతను వ్యతిరేకిస్తున్న వారసులు

తెలంగాణాకు నూతన అసెంబ్లీ భవన నిర్మాణం కోసం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో చారిత్రక ప్యాలెస్‌ను కూల్చివేయాలని తలపెట్టింది ప్రభుత్వం. అయితే.. దీనిని తీవ్రంగా తప్పుబడుతున్నారు దాని వారసులు. వివిధ దేశాల్లో స్థిరపడ్డ నవాబ్‌ సఫ్దర్‌ జంగ్‌ మనవళ్లు నగరానికి వచ్చి ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ పరిరక్షణపై చర్చించారు. 150 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం ఇప్పటికీ చెక్కు చెదరలేదని.. మరో 200 ఏళ్లపాటు ఇలాగే ఉంటుందని.. ఈ వారసత్వ కట్టడాన్ని ప్రభుత్వం మరింత అభివృద్ధి చేయాల్సిందిపోయి.. కూల్చివేయాలన్న సీఎం కేసీఆర్‌ నిర్ణయం తమను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రం విడిపోయి.. ఎమ్మెల్యేల సంఖ్య 294 నుంచి 119కి తగ్గిందని, వీరికోసం ప్రస్తుత అసెంబ్లీ భవనంలో విశాలమైన స్థలం ఉండగా.. దానిని వదిలేసి చారిత్రక కట్టడాన్ని కూల్చివేసి కొత్తగా నిర్మించాల్సిన అవసరం ఏమిటని నవాబ్‌ సఫ్దర్‌ జంగ్‌ వారసులు ప్రశ్నించారు. భవిష్యత్తులో చార్మినార్‌ను, మక్కా మసీదును కూడా ఏదో ఒక కారణం చెప్పి కూల్చేస్తారా? ఇలాగైతే ఘన చరిత్ర గల హైదరాబాద్‌లో మిగిలేదేమిటని అన్నారు. భవనాన్ని సంరక్షిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతోనే సఫ్దర్‌ జంగ్‌ మరణించాక దానిని ప్రభుత్వానికి అప్పగించామని, భవిష్యత్తులో కూల్చివేస్తారనే అనుమానం అప్పట్లో వచ్చి ఉంటే అప్పగించేవాళ్లమే కాదని పేర్కొన్నారు.

ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ కూల్చివేతపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. దీనిని మ్యూజియంగా మార్చాలని, హైదరాబాద్‌ ఘన చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తామని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story