ఒక్క ఇంజక్షన్ ఖరీదు అక్షరాలా రూ.14 కోట్ల 57 లక్షలు.. దేనికో తెలిస్తే..

ఒక్క ఇంజక్షన్ ఖరీదు అక్షరాలా రూ.14 కోట్ల 57 లక్షలు.. దేనికో తెలిస్తే..

బాబోయ్.. వచ్చిన జబ్బు కంటే భయపెడుతోంది ఇంజెక్షన్ ధర. అసలే ఆసుపత్రి గుమ్మం ఎక్కాలంటే గుండె పట్టుకోవాల్సిందే. జేబులు ఖాళీ అయినా రోగం తగ్గదు. వందల్లో ఫీజులు.. వేలల్లో టెస్టులు. ఇక ఆపరేషన్ అంటే లక్షలతో వ్యవహారం. జ్వరం వస్తే పది రూపాయిలిచ్చి సూది మందేంయించుకుంటే తగ్గిపోతుందని భావిస్తారు. పోనీ మహా అయితే ఏ యాంటి బయాటిక్ లాంటిదో అయితే వందల్లో ఉంటుంది. కానీ ఇదేంటో జోల్‌జెన్‌స్మా అనే ఇంజెక్షన్ ఖరీదు అక్షరాలా రూ.14 కోట్ల 57 లక్షలు. ఇంతకీ ఎందుకంత రేటు అంటే.. పుట్టిన పిల్లల్లో కొన్ని సార్లు జన్యులోపాలు వస్తాయి. వాటిని మొదట్లోనే సరి చేయకపోతే, జీవితాంతం అవి వారిని ఇబ్బంది పెడుతుంటాయి. కొన్ని కేసుల్లో ఈ లోపాలతో పుట్టిన పిల్లలు రెండేళ్లలోనే చనిపోతుంటారు. ఇలాంటి లోపాల్ని సరిచేయడం కష్టంతో కూడుకున్న పని. అందుకే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న స్విట్జర్లాండ్‌కి చెందిన మందుల తయారీ కంపెనీ నోవార్టిస్ ఈ ఇంజెక్షన్‌ని తయారు చేస్తోంది.

జోల్‌జెన్‌స్మా ఇంజెక్షన్ ఇస్తే పిల్లల్లో జన్యులోపాలు తొలగిపోతాయని డాక్టర్లు తెలిపారు. ఎంత జన్యులోపాల్ని సరిదిద్దేది అయితే మాత్రం ఇంత రేటా అంటే.. దానికీ సమాధానం చెబుతోంది ఇంజెక్షన్ తయారు చేసిన నోవార్టిస్ కంపెనీ. ఈ లోపాన్ని సరి చేయడానికి మార్కెట్లో అనేక రకాల మందులున్నాయి. అయితే వాటిని ప్రతిసంవత్సరం ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు పదేళ్ల పాటు వాటిని ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం రూ.30 కోట్లు ఖర్చవుతుంది. అదే జోల్‌జెన్‌స్మా అయితే అలా కాదు. ఒక్కసారి ఈ ఇంజెక్షన్ ఇస్తే చాలు. మళ్లీ ఇవ్వక్కరలేదు. వందలు.. వేలు.. కనీసం.. లక్షలు కూడా కాదే. ఒకసారి ఇవ్వడమే కష్టమంటే మళ్లీ ఇంక రెండోసారి కూడానా. అయినా జబ్బులు కూడా డబ్బున్న వాళ్లకే వస్తాయన్న నానుడి ఉండనే ఉంది. ఇదిలా ఉంటే ప్రతి 8 వేల మంది పసికందుల్లో ఒకరు జన్యు లోపంతో పుడుతున్నారట. ఒక్క అమెరికాలోనే ఏడాదికి 450 నుంచి 500 మందికి జన్యులోపాలు వస్తున్నాయని పరిశోధనలు వివరిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story