తూర్పుగోదావరి జిల్లా మల్లంపేట గ్రామంలో ఓ పేదరైతు సంతానం నారాయణమూర్తి. హై స్కూల్, కాలేజ్ రోజుల నుంచి వామపక్ష ఉద్యమాలకు ఆకర్షితుడైనా.. అటు ఎన్టీఆర్, ఏఎన్నార్ లను చూస్తూ వాళ్లలా కావాలనే ఆశనూ పెంచుకున్నాడు.
నారాయణమూర్తికి సినిమా అంటే పిచ్చి.. చాలా రోజులు అవకాశాలు కోసం తిరిగాడు.. కానీ ఎవ్వరు కూడా అవకాశం ఇవ్వలేదు.. దాసరి వంటి వారి ప్రోత్సాహంతో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి నటుడుగా, ఆ తర్వాత దర్శకుడిగా ఎదిగారు.
సమకాలీన సమస్యలనే ఇతివృత్తాలుగా చేసుకుని సినిమాలు రూపొందించే నారాయణమూర్తి చుండూరు దళితుల మారణహోమం నేపథ్యంలో తెరకెక్కించిన లాల్ సలామ్ ఓ సంచలనం. ఈ సినిమా తెరకెక్కించాడని ఆయన్ని ఇంటరాగేట్ చేశారు.
దండోరా సినిమా ఎన్నో ప్రభుత్వాలు చేయలేకపోయిన పనిని చేసి చూపింది. సారా వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా రాష్ట్రవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించింది. చాలా మంది సారా వ్యసనపరులు ఈ సినిమా చూసిన తర్వాత స్వచ్ఛందంగా ఆ వ్యసనాన్ని మానేశారంటే అర్థం చేసుకోవచ్చు దండోరా ఎఫెక్ట్ ఎంతలా ఉందో..
భూ పోరాటం నేపథ్యంలో రూపొందిన ఎర్రసైన్యం మలిదశ భూ పోరాటానికి ఆజ్యం పోసింది. ఎర్రసైన్యం టైమ్ కే నారాయణమూర్తి క్రేజ్ మామూలుగా లేదు. అన్ని సినిమాలూ అఖండ విజయం సాధిస్తూ.. నారాయణమూర్తి అంటే తమ హీరో అని ప్రతి ఒక్కరూ ఫీలయ్యేలా చేశాయి.
నారాయణమూర్తి అంటే ప్రభుత్వ వ్యతిరేక సినిమాలు తీస్తాడనుకున్నారేమో.. ఏ ప్రభుత్వాలూ ఆయనకు గానీ, ఆయన చిత్రాలకు గానీ అవార్డులివ్వలేదు. అయినా ప్రజల ఆశిస్సులే అవార్డులు
నారాయణమూర్తి. అనవసరమైన సెట్టింగులు, అర్థం లేని ప్రేమ సన్నివేశాలు.. ఐటమ్ సాంగ్స్ వంటివేవీ ఆయన సినిమాల్లో కనిపించవు. సమస్యను బట్టి.. సాధ్యమైనంత వరకూ ఆయా ప్రాంతాల్లోనే రియలిస్టిక్ గా చిత్రీకరణ చేసేవారు. అందుకే గిరిజనుల భూ సమస్యలపై ఎన్నో చట్టాలు చెప్పలేకపోయిన విషయాన్ని ఆయన సినిమాలు చెప్పాయి..