ఐస్‌క్రీంని నాకి అడ్డంగా బుక్కైంది.. 20 ఏళ్ల జైలు శిక్ష.. రూ.6.8 లక్షల జరిమానా.. వీడియో

ఐస్‌క్రీంని నాకి అడ్డంగా బుక్కైంది.. 20 ఏళ్ల జైలు శిక్ష.. రూ.6.8 లక్షల జరిమానా.. వీడియో

చేస్తున్న పని తప్పని తెలిసే చేస్తుంటారు. ఎవరూ చూడట్లేదని అనుకుంటారు. కానీ ఏదో ఒక కన్ను మనల్ని గమనిస్తూనే ఉంటుంది. తన స్నేహితురాలు చేసిన ఓ గొప్పపనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఫ్రెండ్. అదే ఆమె కొంప ముంచింది. సరదాగా చేసిందో, కావాలనే చేసిందో కానీ ఇప్పుడు భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తోంది. టెక్సాస్‌లోని లుఫ్కిన్‌లో గల వాల్‌మార్ట్‌‌లో ఓ యువతి షాపింగ్ చేయడానికని వచ్చి అక్కడ ఉన్న ఫ్రిజ్‌లో నుంచి పెద్ద ఐస్ క్రీమ్ బాక్స్ తెరిచి నాకేసి మళ్లీ యధావిధిగా మూతపెట్టేసి లోపల పెట్టేసింది. ఇదంతా ఫ్రెండ్ వీడీయో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్ అయ్యింది. ఆమెకు కొంచెమైనా బుద్ది, జ్ఞానం ఉందా.. ఎంగిలి చేసిన ఐస్‌క్రీంని మళ్లీ ఫ్రిజ్‌లో పెడుతుందా.. అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు.

ఇంతకీ ఎవరా మహానుభావురాలు అని రంగంలోకి దిగారు పోలీసులు. మొత్తానికి ఆమెని పట్టుకున్నారు. ఏ చిన్న నేరం చేసినా అక్కడ శిక్షలు అసలే కఠినంగా ఉంటాయి. ఈమె చేసిన పనిని కూడా పెద్ద నేరంగా పరిగణనలోకి తీసుకుంది అక్కడి చట్టం. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి 2 నుంచి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు, 10 వేల డాలర్లు (రూ.6,86,910) జరిమానా చెల్లించాల్సి ఉంటుందట. ఆహార కల్తీపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కఠినతరంగా ఉన్న నేపథ్యంలో ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆమె చేసిన పనికి ఆ రోజు ఫ్రిజ్‌లో ఉంచిన ఐస్‌క్రీమ్ బాక్సులన్నీ తొలగించామని ఐస్‌క్రీం పార్లర్ యాజమాన్యం పేర్కొంది. ఐస్‌క్రీం బాక్స్‌కి సీల్ వేసి ఉన్నా చాలా తెలివిగా దాన్ని తెరిచి తిన్నదని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story