Bihar Assembly Election Results: నేడే బీహార్ ఎన్నికల ఫలితాలు..
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఫలించేనా..?
నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను రెండు విడతల్లో ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత EVMల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపు దృష్ట్యా, అన్ని జిల్లాల్లో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కమిషన్ సైతం అవసరమైన అన్ని సన్నాహాలు చేసింది. బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. 243 సీట్లలో 122 సీట్ల మెజారిటీ అవసరం. ఓవైపు.. నితీష్ కుమార్ విజయం సాధిస్తానని ప్రకటించగా, మరోవైపు.. తేజస్వి యాదవ్ నవంబర్ 18న ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. కాగా.. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏ విజయం సాధిస్తుందని ప్రకటించాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. NDA కి మహిళలు, OBCలు, EBCల నుంచి బలమైన మద్దతు లభించింది. ఇంతకీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఫలిస్తాయా..? నితీష్ కుమార్ అధికారాన్ని నిలుపుకుంటారా లేదా తేజస్వి యాదవ్ బీహార్ భవిష్యత్తుకు కొత్త కథ రాస్తారా అనేది ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయి.
బీహార్‌లో ఈసారి రికార్డు స్థాయిలో 67.13% ఓటింగ్ నమోదైంది. రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధికం. 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరిగింది. నవంబర్ 6న జరిగిన మొదటి దశలో 18 జిల్లాల్లోని 121 స్థానాలకు, నవంబర్ 11న జరిగిన రెండవ దశలో 20 జిల్లాల్లోని 122 స్థానాలకు పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో 67.13 శాతం ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇది 1951 తర్వాత అత్యధికం. మహిళా ఓటర్లు 71.6 శాతం మంది ఓటు వేశారు.