Agni-5 Missile: మిషన్ దివ్యాస్త్ర విజయవంతం..
డీఆర్డీవోను అభినందించిన ప్రధాని;
స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన అగ్ని-5 మొదటి టెస్ట్ ఫ్లైట్ విజయవంతమైంది. భారత రక్షణ పరిశోధనా సంస్థ (DRDO) మిషన్ దివ్యాస్త్ర పేరుతో చేపట్టిన ప్రయోగం విజయవంతమవగా.. ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలను అభినందించారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలను చూసి గర్విస్తున్నామని ట్వీట్ చేశారు. అగ్ని-5 క్షిపణి ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదిందించి. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్‌వి) సాంకేతికతతో డీఆర్డీవో మిస్సైల్‌ను రూపొందించింది. ఎంఐఆర్‌వీ సాంకేతికతతో అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం దేశం రక్షణ సంసిద్ధత, వ్యూహాత్మక సామర్థ్యాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని మోదీ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. మిషన్ దివ్యాస్త్ర అతిపెద్ద అడ్వాన్స్‌డ్ వెపన్స్ సిస్టమ్‌గా తెలుస్తున్నది. దీనికి దేశ భౌగోళిక స్థితిగతులను మార్చే సత్తా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎంఐఆర్‌వీ టెక్నాలజీతో ఒక మిసైల్‌ని ఉపయోగించి బహుళ వార్ హెడ్స్‌ను వివిధ ప్రాంతాల్లోని టార్గెట్స్‌ను ఛేదించవచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ టెక్నాలజీ కలిగిన దేశాల సంఖ్య తక్కువగా ఉండగా.. ఆయా దేశాల సరసన భారత్ సైతం చేరినట్లయ్యింది. ఈ అగ్ని-5 మిసైల్‌లో ఇండీజీనియస్ ఏవియోనిక్స్ సిస్టస్స్ ఉంటాయి. హై ఎక్యురసీ సెన్సార్ ప్యాకేజ్ ఉండడంతో అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. మిషన్ దివ్యాస్త్ర విజయవంతంతో భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చేరినట్లయ్యింది.
అగ్ని5 క్షిపణి ‘మిషన్ దివ్యాస్త్ర’కి సంబంధించిన వ్యవస్థను స్వదేశీ ఏవియానిక్స్ సిస్టమ్‌లు, పూర్తి కచ్చితత్వంతో వ్యవహరించే సెన్సార్ ప్యాకేజీలతో అమర్చారు. కచ్చితత్వంలో లక్ష్యాలను ఛేదించగలదు అగ్ని 5 క్షిపణి. కాగా, అగ్ని-5కి అణ్వాయుధ సామర్థ్యం ఉంది. దాదాపు 5,000 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. చైనాలో ఉన్న డాంగ్‌ఫెంగ్-41 మిస్సైల్స్ 12 వేల కిలోమీటర్ల నుంచి 15 వేల కిలోమీటర్ల వరకు ఉన్న లక్ష్యాలను ఛేదించగలవు. వాటిని దృష్టిలో ఉంచుకుని.. భారత్ ఈ అగ్ని-5 క్షిపణిని రూపొందించింది.