TPCC: నేటి నుంచే కాంగ్రెస్ బస్సు యాత్ర

TPCC: నేటి నుంచే కాంగ్రెస్ బస్సు యాత్ర
ములుగు నుంచి ప్రారంభం కానున్న మూడు రోజుల బస్సుయాత్ర... పాల్గొననున్న రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ

తెలంగాణలో నేటి నుంచి మూడు రోజులపాటు జరగనున్న బస్సు యాత్రలో కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు పాల్గొంటారు. ఇవాళ సాయంత్రం ములుగు రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. ములుగులో మొదలయ్యే మొదటి విడత బస్సు యాత్ర నిజామాబాద్‌లో ముగుస్తుంది. ఈ యాత్ర సమయంలోనే కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మూడు రోజుల్లో 175 కిలోమీటర్లు 8 అసెంబ్లీ నియోజకవర్గాలల్లో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారం జరగనుంది. ఇవాళ సాయంత్రం ములుగులోని రామప్ప గుడిలో రాహుల్ , ప్రియాంక గాంధీ లు ప్రత్యేక పూజలు చేస్తారు. ములుగులో పబ్లిక్ మీటింగ్ తర్వాత బస్సు యాత్ర భూపాలపల్లి చేరుకుని రాత్రి బసచేస్తారు.


టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ ,ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు తదితరులు బస్సు యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రెండో రోజు ఈ నెల 19 వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నిరుద్యోగ యువతతో పాదయాత్ర చేస్తారు. ఆ తర్వాత రామగుండములో సింగరేణి , ఎన్టీపీసీ కార్మిక సంఘాలతో సమావేశం అవుతారు. అక్కడ నుంచి సాయంత్రానికి పెద్దపల్లి చేరుకుంటారు. అక్కడ పబ్లిక్ మీటింగ్ తర్వాత రైస్ మిల్లర్స్ సంఘాలతోపాటు రైతులతో ఇష్టాగోష్టి నిర్వహిస్తారు. అక్కడ నుంచి సాయంత్రానికి కరీంనగర్ చేరుకుని పాదయాత్ర లో పాల్గొంటారు. రాత్రి కి అక్కడనే బస చేస్తారు.

మరుసటి రోజు కరీంనగర్ నుంచి బోధన్ చేరుకుంటారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బీడీ కార్మికులు, గల్ఫ్ వలస కార్మికుల కుటుంబాలతో ఇంటరాక్షన్ ఉంటుంది. అనంతరం నిజామ్ షుగర్ ఫ్యాక్టరీ సందర్శిస్తారు. అక్కడ నుంచి సాయంత్రం 4 గంటలకు ఆర్మూరు చేరుకుని పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. అక్కడ నుంచి రాత్రి 7 గంటలకు నిజామాబాద్ చేరుకొని పాదయాత్రలో పాల్గొంటారు. ఈ బస్సు యాత్ర ద్వారా నిర్వహించనున్న ప్రచారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఓల్యాలను ఎండకడతారు. యువ , వ్యవసాయ , ఎస్సీ , ఎస్టీ ఈ మూడు డిక్లరేషన్స్ తోపాటు చేయూత 4వేల పెన్షన్, ఆరు హామీల గ్యారంటీ కార్డులను జనంలోకి విస్తృతంగా తీసుకెళతారు. అంతే కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఐక్యతను చాటేందుకు ఈ బస్సుయాత్ర ఉపయోగ పడుతుందని భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story