హైదరాబాద్‌ను వణికించిన భారీ వర్షం.. మరో 48 గంటలపాటు వాన గండం

హైదరాబాద్‌ నగరాన్ని వర్షం తడిసి ముద్ద చేసింది.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నిన్న సాయంత్రం నుంచి వర్షం కురిసింది.. మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు భారీ వర్షం పడింది.. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. రోడ్లు జలమయం అయ్యాయి.. పలు చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. మరో 48 గంటలపాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు నిచిలింది.. అయితే, జీహెచ్‌ఎంసీ అధికారుల అప్రమత్తంగా వ్యవహరించడంతోపాటు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. డిజాస్టర్‌ రెస్పసాన్స్‌ ఫోర్స్‌ అర్థరాత్రి రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది.. ఛాదర్‌ఘాట్‌ ప్రధాన రహదారిపై భారీగా నిలిచిపోయిన నీటిని విపత్తుల నిర్వహణ సిబ్బంది తొలగించారు. మోటార్ల సాయంతో నీటినంతటినీ తోడిపోశారు. నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో కమిషనర్‌ బొంతు రామ్మోహన్‌ జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. పంజాగుట్ట మోడల్‌ హౌజ్‌ దగ్గర సహాయక చర్యలను జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ ఫసియుద్దీన్‌ దగ్గరుండి పర్యవేక్షించారు.