వర్ష బీభత్సం.. 22 మంది మృతి.. స్కూళ్లకు సెలవు

కేరళను వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరద ఉద్ధృతి కారణంగా పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు.

కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు రాష్ట్రమంతటా వాగులు వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అన్ని జలాశయాల్లో నీటి మట్టం గరిష్ట స్థాయిని చేరడంతో గేట్లు తెరిచి వరదనీటిని వదిలి పెడుతున్నారు. కొండ ప్రాంతాల్లో జోరు వానలకు చరియలు విరిగి పడుతున్నాయి. పెద్ద సంఖ్యలో మట్టి ఇళ్లు కూలిపోయాయి. వర్షాలు, వరదలతో ఇప్పటివరకు 22 మంది ప్రాణాలు కోల్పోయారు.

మళప్పురం, కోళికోడ్‌, వయనాడ్‌‌, పాలక్కాడ్‌ జిల్లాల్లో వర్ష బీభత్సం ఎక్కువగా ఉంది. ఇడుక్కి జిల్లాలో కొండచరియలు విరిగి పడి 11 మంది చనిపోగా.. వీరిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండటం తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది. మళప్పురంలో ఐదుగురు, కన్నూరులో ముగ్గురు వయనాడ్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోగా… పాలక్కడ్, కోజికోడ్, వయనాడ్‌ జిల్లాల్లో పలువురు గల్లంతయ్యారు.

మారుమూల ప్రాంతాల్లోనే కాదు పట్టణ ప్రాంతాల్లో సైతం భారీ వర్షానికి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొచ్చి నగరంలో రోడ్లపై నడుము లోతు వరదనీరు చేరుకుంది. జనం రాకపోకలు పూర్తిగా స్థంభించాయి. కరెంటు సరఫరా నిలిచిపోవడంతోపాటు.. తాగేందుకు నీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంది.

కొచ్చి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులోకి నీళ్లు రావడంతో విమానాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దాదాపు 3 గంటల పాటు ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరో 36 గంటల పాటు వర్షాల తీవ్రత ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రదేశాలకు తరలించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ, నేవీ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. వయనాడ్ లో నేవీకి చెందిన నాలుగు డైవింగ్ టీమ్స్, సీ కింగ్ హెలికాప్టర్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

మరోవైపు భారీ వర్షాలతో ఇడుక్కీ రిజర్వాయర్‌ నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. దీంతో 26 ఏళ్ల తర్వాత తొలిసారి డ్యాం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇదేకాదు, రాష్ట్రవ్యాప్తంగా 22డ్యామ్‌ల గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నట్లు ముఖ్యమంత్రే ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -