టీఆర్‌ఎస్‌లో మాజీలు, ఎమ్మెల్యేల మధ్య వర్గ పోరు

టీఆర్‌ఎస్‌లో మాజీలు, ఎమ్మెల్యేల మధ్య వర్గ పోరు

తెలంగాణ మున్సిప‌ల్ ఎన్నికల్లో టికెట్ల పోరు మొద‌లైంది. రాష్ట్రంలో ఏ ఎన్నికైనా టీఆర్‌ఎస్‌లో ఆధిపత్య లొల్లి బయటపడుతూనే ఉంది. ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేలు త‌మ అనుచరుల‌కే టికెట్లు ఇప్పించుకోవ‌టంతో మాజీలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇక మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో సేమ్ సీన్ రిపీట్ అయితే.. టీఆర్‌ఎస్‌లో విభేదాలు ర‌చ్చకెక్కే అవకాశం లేకపోలేదు. ఇరు వ‌ర్గాలు ఇప్పటి నుంచే టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తుండ‌టంతో టీఆర్‌ఎస్‌లో పాలిటిక్స్ హీటెక్కాయి.

ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ నాటి నుంచే టీఆర్‌ఎస్‌లో వ‌ర్గ పోరు మొద‌లైంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన నేత‌లు.. పార్టీలో చేరిన ఎమ్మెల్యేల మ‌ధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేలే పెత్తనం చ‌లాయించ‌టంతో మాజీలు త‌ట్టుకోలేక‌పోతున్నారు. దీనికితోడు ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో త‌మ అనుంగుల‌కే ఎమ్మెల్యేలు టికెట్లు ఇప్పించుకోవడంతో మాజీలు రగిలిపోతున్నారు. ఇక స‌భ్యత్వ న‌మోదు కార్యక్రమం కూడా ఆగ్నికి ఆజ్యం పోసింది. సభ్యత్వ న‌మోదులోనూ ఎమ్మెల్యేలు.. మాజీల అనుచ‌రుల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌టంతో ప‌లు చోట్ల వివాదాలు చోటు చేసుకున్నాయి. దీనికి తోడు మున్సిప‌ల్ ఎన్నిక‌లు సమీపిస్తుండటంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య పోరు తారాస్థాయికి చేరింది.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో త‌మ అనుచ‌రుల‌కు అవ‌కాశం ఇప్పించుకోవ‌టానికి మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొద‌లుపెట్టారు. కొంత మంది నేత‌లు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను క‌లిసి త‌మ వారికి న్యాయం చేయాల‌ని కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేలు అన‌ధికారికంగా త‌మ అనుచ‌రుల‌ను ఎన్నిక‌ల కోసం ప్రిపేర్ అవ్వాలంటూ సంకేతాలు ఇవ్వడంతో వార్డుల్లో పార్టీ నేత‌లు రెండుగా చీలిపోయారు. ఈసారి త‌మ వ‌ర్గానికి అవ‌కాశం దక్కకపోతే తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉండాల‌ని అనుచ‌రుల‌కు చెబుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రామ‌గుండం మాజీ ఎమ్మెల్యే సోమార‌పు సత్యనారాయణ టీఆర్‌ఎస్‌ను వీడారు. పార్టీ అధినేత కేసీఆర్ అంటే గౌర‌వం అంటూనే ఎమ్మెల్యేతో పాటు ఇత‌ర నేత‌ల వైఖ‌రిని త‌ప్పుబ‌ట్టారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల ముందు ఇలాంటి ప‌రిణామాలు.. టీఆర్‌ఎస్‌కు ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటికే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని బీజేపీ, కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సమయంలో గులాబీ పార్టీలో విభేదాలు రచ్చకెక్కితే అది త‌మ‌కు అనుకూలంగా మారుతుందని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. ఒక వేళ మ‌ళ్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల అభ్యర్థుల ఎంపిక బాధ్యతను అధిష్టానం ఎమ్మెల్యేల‌కే అప్పగిస్తే... మాజీ ఎమ్మెల్యేలు త‌మ దారి తాము చూసుకోవాల‌ని భావిస్తున్నారు. ఈ పరిణామాలు ప్రతిపక్షాలకు కలసివచ్చే అవకాశం లేకపోలేదు.. వారిని త‌మ‌వైపు తిప్పుకునేందుకు విపక్ష పార్టీలు ఇప్పట్నుంచే ప్రయత్నాలు చేస్తుండటంతో టీఆర్‌ఎస్‌కు మరింత ఇబ్బందులు తప్పవనే మాట వినబడుతోంది. ఇక మున్సిపల్‌ ఎన్నిక‌లకు స‌మ‌యం ముంచుకొస్తుండ‌టంతో టీఆర్‌ఎస్‌లో రాజ‌కీయం రంజుగా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది. పార్టీలో గ్రూపులుగా విడిపోయిన నేత‌ల‌ను ఒక తాటిపైకి తెచ్చే స‌మ‌యం కూడా లేద‌నే చ‌ర్చ టీఆర్‌ఎస్‌లో జ‌రుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story