వైఎస్‌ కంటే జగన్ పాలన ఘోరంగా ఉంది : టీడీపీ పొలిట్ బ్యూరో

వైఎస్‌ కంటే జగన్ పాలన ఘోరంగా ఉంది : టీడీపీ పొలిట్ బ్యూరో

ఏపీలో శాంతిభద్రతలను కాపాడటంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ ఆరోపించింది. గుంటూరులో సమావేశమైన టీడీపీ పొలిట్‌బ్యూరో.. పలు కీలక అంశాలపై చర్చించింది.. ఓటమికి గల కారణాలను విశ్లేషించింది. ఎప్పుడూ అండగా ఉండే బీసీలు, మాదిగలతోపాటు మరికొన్ని వర్గాల ప్రజలు టీడీపీకి దూరం కావడంపై చర్చించారు. మళ్లీ ఆయా వర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు..

అటు ఎన్నికల్లో వైసీపీ మాదిరిగా డబ్బు ఖర్చు చేయలేకపోయాం అని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, రాష్ట్రభవిష్యత్తుపైనే ఫోకస్ చేసి..సామాజిక సమీకరణాల్లో విఫలం అయ్యామని మరికొందరు గుర్తుచేశారు. ఓవర్ కాన్ఫిడెన్స్, అతి ఉత్సాహం వల్ల కూడా కొందరు నేతలు ఓడిపోయారని పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది..

పొలిట్‌బ్యూరో సమావేశంలో సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కన్నీటిపర్యంతమయ్యారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి గురించి చెబుతూ... ఇంత చేసిన ప్రజలు వైసీపీ వైపు మొగ్గారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్న క్యాంటీన్ల మూసివేతతో అందరూ భాదపడుతున్నారని చెప్పారు.

వైఎస్‌ కంటే జగన్ పాలన ఘోరంగా ఉందని పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల్ని ఆపకపోతే చంద్రబాబే నేరుగా రంగంలోకి దిగుతారని హెచ్చరించారు పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు. వైఎస్‌ ఉన్నప్పుడు కూడా చంద్రబాబుకి సెక్యూరిటీ తగ్గించలేదని.. కానీ జగన్ వచ్చిన తర్వాత తగ్గించారని ఆరోపించారు..

పేదల పొట్ట కొట్టడానికే జగన్ సీఎం అయ్యారని ఆరోపించారు మరో సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు. జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆరోపించారు.. ఇసుక ధరలను నాలుగు రెట్లు పెంచి... వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఫైరయ్యారు..

Tags

Read MoreRead Less
Next Story