ఆంధ్రప్రదేశ్ లో కలకలం సృష్టించిన వైయస్ వివేకా హత్య

ys vivekanandhareddy murder

రాజకీయాల్లో అత్యంత సౌమ్యుడిగా పేరున్న మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానంద రెడ్డి కడప జిల్లా పులివెందులలో దారుణ హత్యకు గురికావడం ఆంధ్రప్రదేశ్ లో కలకలం సృష్టించింది. తొలుత ఆయన గుండెపోటుతో కన్నుమూశారన్న వార్తలొచ్చాయి. మధ్యాహ్నం కుటుంబ సభ్యుల సమక్షంలో వివేకా దేహానికి పోస్టుమార్టం నిర్వహించడంతో అసలు విషయం బయటపడింది. ఆయనది ఖచ్చితంగా హత్యేనని పోలీసులు తేల్చారు. మృతదేహంపై దాదాపు ఏడుచోట్ల బలమైన గాయాలున్నాయని… అవన్నీ పదునైన ఆయుధంతో చేసినవని ప్రాథమిక నివేదికలో వెల్లడైంది.

వివేకా హత్య తీవ్రతను గమనించిన ఏపీ సర్కారు దీనిపై విచారణకు సీఐడీ అడిషన్‌ డీజీ అమిత్‌ గార్గ్‌ నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందం సిట్‌ ను ఏర్పాటు చేసింది. వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించిన అమిత్‌గార్గ్‌.. కేసు దర్యాప్తును పర్యవేక్షించారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్ హత్య జరిగిన ప్రాంతాన్ని ‌ క్షుణ్ణంగా పరిశీలించాయి. ఘటన స్థలంలో నిందితుల కాలిముద్రలు, వేలి ముద్రలు దొరికాయని ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ తెలిపారు.

వివేకా ఇంట్లో వెనకడోర్‌ తెరిచి ఉండడం, ఆయన మృతదేహాన్ని బెడ్‌రూం నుంచి బాత్‌రూమ్‌కు తరలించడం చూస్తుంటే… ఒకరి కన్నా ఎక్కువ మంది ఇంట్లోకి చొరబడి ఆయనపై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివేకా హత్య కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నామని, నిందితులపై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు.

నిందితులను పట్టుకోవడానికి ఎస్పీ 5 టీంలను ఏర్పాటు చేశారు. ఇక పోలీసు జాగిలాలు వివేకా ఇంటి వెనుక తచ్చాడుతూ అక్కడి నుంచి మెయిన్ రోడ్‌ వైపు పరిగెత్తి ఆగిపోయాయి. అంటే హంతకులు ఇంటి వెనుక నుంచి వచ్చి, అదే దారి గుండా వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సేకరించిన వేలిముద్రలను ఫింగర్ ప్రింట్‌ ఎక్స్ పర్ట్స్ దగ్గరికి పంపించారు.